ఆర్టీసీ దాదాపు 2015 తర్వాత భారీ ఎత్తున బస్సులు కొనుగోలు చేసేందుకు సిద్దమవుతుంది. సుమారు 1000 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా.. అశోక్ లీలాండ్ కంపెనీ వారు సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల డెండర్లు దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీకి అశోక్ లేలాండ్ కంపెనీ వారు బస్సులు పూర్తి కాగానే దశల వారిగా పంపించేందుకు సిద్దమవుతుంది. ఈ క్రమంలో ఆదివారం నాలుగు సూపర్ లగ్జరీ బస్సులు టీఎస్ఆర్టీసీకి చేరాయి. ఇక టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ ప్రయాణీకులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో ప్రజలు ప్రవేట్ వాహనాలు వదిలి.. ఆర్టీసీ వైపు మొగ్గు చూపించాలన్న ఉద్దేశ్యంతో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. సామాన్య ప్రయాణీకుడిలా ప్రజలతో ఆయన ప్రయాణిస్తూ.. బస్సుల్లో, బస్టాండ్ లో వారు ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. ప్రతి పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల సౌకర్యం కోసం తెలంగాణలో వెయ్యి అదనపు బస్సుల ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు టెండర్ ప్రక్రియ పూర్తయి అశోక్ లేలాండ్ టెండర్లు దక్కించుకుంది.
2015 లో కొనుగోలు చేసిన బస్సులు ఇప్పటి వరకు రోడ్లపై తిరుగుతున్నాయి. ఆ బస్సుల్లో కొన్ని ఎరుపు తెలుపు, ఆకు పచ్చ, గులాబి రంగు లో ఉన్నాయి. అశోక్ లేలాండ్ సరఫరా చేయబోతున్న బస్సులు కొత్త లుక్ తో అదిరిపోయే విధంగా ఉన్నాయి. ఈ బస్సులు చూడటానికి వోల్వా లుకింగ్ లా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ బస్సులు తెలుపు రంగుపై నీలి రంగుతోపాటు క్రీమ్ కలర్ లు ప్రత్యెక ఆకర్షణగా ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాదు ఈ బస్సుల్లో లగేజీ కోసం విశాలమైన స్థలం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటి వరకు 450 సూపర్ లగ్జరీ బస్సులు దాదాపు ఆరు లక్షల కిలోమీటర్ల మేర తిరిగాయని.. వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి సిటీ బస్సులుగా, పల్లె వెలుగు బస్సులుగా మార్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు టీఎస్ ఆర్టీసీ ఏర్పడిన తర్వాత మొదటి సారిగా స్లీపర్ బస్సులను కూడా ప్రవేశపెట్టబోతున్నారు.. ఇప్పటికే 16 బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించినట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణ రోడ్లపై ఆకర్షణీయమైన కొత్త బస్సులు తిరగబోతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.