యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు చాప కింద నీరులా విస్తరిస్తుండటం గురించి వార్తల్లో చూస్తున్నాం. యువతను గంజాయి మత్తుకు అలవాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఈ ముఠాల ఆగడాలు ఈమధ్య పెరిగిపోయాయి. దీనికి తాజా ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
దేశ భవిష్యత్తుగా చెప్పుకునే యువత మత్తుమందుకు బానిసగా మారుతోంది. చాలా రాష్ట్రాలను ఈ సమస్య పట్టిపీడిస్తోంది. చిన్న వయసులో దుర్వ్యసనాల పాలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి, డ్రగ్స్, మద్యపానం లాంటి వాటి బారిన పడి కన్నవారికి కన్నీళ్లను మిగులుస్తున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లాలోని మైలార్దేవ్పల్లిలో గాంజా గ్యాంగ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కిరాణా దుకాణంలో కూర్చున్న సమీర్ అనే బాలుడ్ని బలవంతంగా దగ్గర్లోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. గంజాయికి డబ్బులు ఇవ్వాలని బాలుడి బట్టలు విప్పి.. బెల్ట్, కర్రలతో దాడి చేశారు.
గంజాయి గ్యాంగ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు.. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నారు. సమీర్ ఒంటి మీద ఉన్న గాయాలను చూసి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గంజాయ్ గ్యాంగ్ తనపై దాడి చేసిన విషయాన్ని పేరెంట్స్కు బాలుడు చెప్పాడు. దీంతో మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్లో బాలుడి తల్లిదండ్రులు కంప్లయింట్ చేశారు. మహ్మద్ సైఫ్, అబ్బూతో పాటు మరో ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమపై కేసు పెట్టారన్న విషయం తెలిసిన ముఠా మెంబర్స్.. ‘నీకు దిక్కున్న చోట చెప్పుకో. ఇప్పటికే ఇద్దర్ని హత్య చేశాం’ అంటూ బాలుడ్ని బెదిరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.