తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(public-private partnership)లో భాగంగా ఏర్పాటు చేయబడిన ఈ మల్టీప్లెక్స్.. లీజు బకాయిలను చెల్లించవలసి ఉందట. ఒప్పందం ప్రకారం.. ప్రభుత్వం మల్టీప్లెక్స్ కోసం భూమిని ఇచ్చిందని, అందుకు మల్టీప్లెక్స్ ఆదాయంలో కొంత భాగాన్ని (ADP-అదనపు అభివృద్ధి ప్రీమియం) ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందట. కానీ మల్టీప్లెక్స్ యాజమాన్యం గత కొన్నేళ్లుగా చెల్లింపులు జరపలేదని.. ఇప్పటివరకు సుమారు 27.45 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని సమాచారం.
ఒప్పందం ప్రకారం సరైన సమయానికి బకాయిలు చెల్లించనందున చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ అధికారులు సన్నద్ధమవుతున్నారు. బకాయిలను క్లియర్ చేయడంలో విఫలమైతే పౌర సేవలను నిలిపివేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయనున్నారట. ఇక ప్రభుత్వానికి ప్రసాద్ మల్టీప్లెక్స్‌తో పాటు లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఎక్స్‌పోటెల్ హోటల్(రూ.15.13 కోట్లు), మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్(రూ.75.05 కోట్లు), జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్(రూ.5.67 కోట్లు), నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్(రూ.6.51 కోట్లు), లోయర్ ట్యాంక్ బండ్ వద్ద స్నోవరల్డ్(రూ.15.01 కోట్లు), శామీర్‌పేటలోని గోల్ఫ్ కోర్స్(రూ.5.58 కోట్లు) కూడా జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది.