టికెట్ లేకుండా రైలు ప్రయాణం నేరం. ఈ విషయం తెలిసి కూడా ఇద్దరు యువకులు రైలు ఎక్కడమే కాదూ.. టికెట్ అడిగినందుకు టికెట్ కలెక్టర్ (టీసీ)పై రుబాబు చేశారు. అతడితో గొడవకు దిగారు. ఇది వివాదం ముదిరి ముదిరి చివరకు దాడి చేసుకునేంత వరకు వెళ్లింది.
ఇటీవల రైలు ప్రయాణాలు వివాదాస్పద కేంద్రాలుగా మారుతున్నాయి. మొన్నటి మొన్న ఓ రైలులో ప్రయాణిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు.. వారి నుండి డబ్బులు, నగదును దోచుకెళ్లిన సంగతి విదితమే. ఈ ఘటన మర్చిపోక ముందే మరో ఘాతకం చోటుచేసుకుంది. టికెట్ లేకుండా రైలు ప్రయాణం నేరమని తెలిసినా కూడా ఇద్దరు యువకులు ఓ రైలులో ఎక్కి దర్జాగా కూర్చున్నారు. చెకింగ్‌కు వచ్చిన టికెట్ కలెక్టర్‌కు(టీసీ) దొరికిపోయారు. టీసీ టికెట్ అడిగితే నీళ్లు నలిమిన ఇద్దరు.. తిరిగి ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టీసీ గాయపడ్డారని తెలుస్తోంది.
ఖమ్మం జీఆర్పీ ఎస్సై భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వరంగల్ స్టేషన్‌కు చేరుకుంది. మహబూబాబాద్‌కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్‌కు చెందిన మోతిపట్ల సుమన్ టికెట్ లేకుండా ఎస్-1 బోగిలో ఎక్కి కొంత దూరం ప్రయాణించారు. అదే రైలులో కిరణ్ కుమార్ అనే టీసీ బల్లార్షా నుంచి విజయవాడ వరకు విధులు నిర్వహిస్తున్నారు. అంతలో ఆ భోగిలో టికెట్లు పరిశీలనకు వచ్చిన టీసీ.. వారిద్దరిని టికెట్లు అడిగారు. టికెట్లు అడిగినందుకు రవితేజ, సుమన్‌లు టీసీతో గొడవకు దిగారు. గొడవ ముదిరి చివరకు ఇద్దరూ కలిసి టీసీ కిరణ్ కుమార్‌పై చేయి చేసుకున్నారు. దీంతో ఆయన గాయపడ్డారు.
తోటి ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో సీటీఐ శ్రీరాం టీసీ కిరణ్‌కుమార్‌ను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధిత టీసీ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్సై భాస్కర్‌రావు వెల్లడించారు. టికెట్ తీసుకోకుండా ప్రయాణించడమే కాకుండా, టికెట్ అడిగినందుకు టీసీని తీవ్రంగా గాయపరిచిన రవితేజ, సుమన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు ఈ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. టికెట్ తీసుకోకుండా ప్రయాణించడమే కాకుండా టీసీపై దాడి చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.