ఆ మద్య తమకు శాశ్వత వైస్ ఛాన్సలర్ ను నియమించడంతో పాటు పలు సమస్యలకు పరిష్కారం చూపించాలని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే.
గురు బ్రహ్మ, గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః.. గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువుని సాక్షాత్తు ఈ త్రిమూర్తులతో పోల్చుతాము. తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం గురువులకు మాత్రమే ఇస్తాం. అలాంటిది ఈ మద్య కొంతమంది గురువులు చేస్తున్న అరాచకాలు.. అకృత్యాలు గురువు స్థానానికే మచ్చ తెచ్చే విధంగా తలపిస్తున్నాయి. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇక్కడ సిబ్బంది నిర్వాకానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
ఆ మద్య తమకు శాశ్వత వైస్ ఛాన్సలర్ ను నియమించాలని.. పలు సమస్యలను పరిష్కరించాలని పట్టుబట్టిన బాసర విద్యార్థులు గతంలో ఎండ, వాన అనేది లెక్కచేయకుండా నిరసనలు చేసి వార్తల్లోకెక్కారు. రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. తాజాగా మరోసారి బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి నిలిచింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభావంతులైన విద్యార్థులు టెక్నాలజీలో కోర్సులను చేయడానికి బాసర ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ క్యాంపస్‌లో ఎప్పుడు ఏదో ఒక ఆందోళన జరుగుతూనే ఉంటుంది. తాజాగా విద్యార్థులు వేసవి సెలవులు ముగించుకుని తిరిగి క్యాంపస్‌కు వచ్చారు. అక్కడ పరిస్థితి చూసి షాక్ తిన్నారు. విద్యార్థుల పుస్తకాలు, సామాన్లు సిబ్బంది బయటపడేశారు. సాధారణంగా హాస్టల్ గదుల మరమ్మతు, ఇతర నిర్వహణ ఉంటే ముందుగాను సమాచారం ఇస్తారు.. దీంతో సామాగ్రిని ఇంటికి తీసుకు వెళ్లేవాళ్లమని.. కానీ ఈసారి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా బయట పడవేశారని విద్యార్థులు వాపోయారు.
ఈ నెల 7వ తేదీనుంచి సెకెండ్ సెమిస్టర్ ఉండడంతో విద్యార్థులు తిరిగి క్యాంపస్‌కి చేరుకోగానే బుక్స్ లేకపోవడంతో ఎలా ప్రిపేర్ కావాలని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. సమాచారం లేకపోవడంతో పుస్తకాలు, స్టడీ మెటిరియల్స్ హాస్టల్ గదిలోనే ఉంచామని.. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ సిబ్బంది చేసిన పనికి విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కానీ సిబ్బంది మాత్రం అందుకు భిన్నంగా చెబుతున్నారు. స్టూడెంట్స్ ఇళ్లలోకి వెళ్లేటప్పుడే వారి బుక్స్ తీసుకెళ్లమని సమాచారమిచ్చామన్నారు. వారి వస్తువులు, బుక్స్ తమతో తీసుకెళ్లాలని సూచించినట్లు సిబ్బంది చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుక్స్, బట్టలు, కొంతమంది సర్టిఫికెట్లు కూడా అలా నిర్లక్ష్యంగా పడవేస్తే పిల్లలు అవి వెతుక్కోవాలా అని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల చదువు విషయంలో ఆటంకం ఏర్పడితే అది బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు, సిబ్బందిదే బాధ్యత అవుతుందని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.