మనిషి రూపంలో ఉన్న దేవుడు – సోను సూద్ ! పేదలు అతడికి పెట్టుకున్న పేరు. కష్టం వచ్చింది అంటే చాలు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధం అంటారు. సామాన్యులు, సెలబ్రిటీలే కాదు – సర్కార్ కు సైతం సాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజలకు ముప్పు ఉందని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్ శక్తివంతమైన ఆక్సిజెన్ జనరేటర్ తరలించే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ కరోనా బాధితుడి ఇంటికి నేరుగా ఆక్సిజన్ సిలిండర్‌నే పంపారు. నల్లకుంటకు చెందిన రాఘవ శర్మ అనే వ్యక్తి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు.
రాఘవ శర్మలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోగా సాయం చేయాలంటూ అతడి కొడుకు లక్ష్మినారాయణ ట్విట్టర్ ద్వారా సోనూ సూద్‌ను కోరారు. స్పందించిన సోనూసూద్ తన చారిటీ ఫౌండేషన్ ద్వారా ఏకంగా ఆక్సిజన్ యంత్రాన్ని ఇంటికి పంపించాడు. గురువారం రాత్రి బతుకమ్మకుంట గోకుల్ స్వీట్ షాప్ ఎదురు వీధిలో ఉన్న రాఘవ శర్మ ఇంటికి కొరియర్ ప్రతినిధి వెళ్లి వారికి ఆక్సిజన్ మిషన్ అందజేయడంతో రాఘవ కుటుంబ సభ్యులు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన సోనూసూద్ అభిమానులు, నెటిజన్లు ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నాయి.