నిండు గర్భిణీ రైల్వేస్టేషన్ లో పురిటి నొప్పులతో బాధ పడుతుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. సాయం చేయమని అక్కడ ఉన్న వారిని అర్ధించారు. అలాంటి సమయంలోనే మానవ రూపంలో ఉన్న దేవత వారి ముందు ప్రత్యక్షమైంది.
సమాజంలోని సంఘ విద్రోహక శక్తుల నుంచి సామాన్య ప్రజలను పోలీసులు కాపాడుతుంటారు. విధి నిర్వహణలో భాగంగా వారు కఠినంగా వ్యవహరిస్తుంటారు. అయితే కఠినమైన ఖాకీ చొక్క వెనుక.. ఎంతో మంచి మనస్సు ఉంది. వారి మంచి మనస్సుకు అద్దం పట్టే ఘటనలు అనేకం జరిగాయి. అంతేకాక విపత్కర పరిస్థితుల్లో వారు దేవళ్లు వచ్చి ప్రజలను కాపాడుతుంటారు. ఇటీవలే ఓ వ్యక్తి గుండె పోటుకు గురైతే.. ఓ కానిస్టేబుల్ సకాలంలో సీపీఆర్ చేసి బతికించారు. తాజాగా ఓ మహిళ కానిస్టేబులు కూడా పురిటీ నొప్పులతో బాధపడుతున్న మహిళకు ప్రసవం చేసింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఆ మహిళ కానిస్టేబుల్ పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ ప్రాంతంలోని భూస్పేర్ అనే గ్రామానికి చెందిన అసబుద్దీన్, ఆయన భార్య అసియా ఖాతూన్ హైదరబాద్ కు వలస వచ్చారు. యూపీ నుంచి వలస వచ్చిన ఈ దంపతులు హైదరాబాద్ లోని భౌరంపేట్ లో నివాసం ఉంటున్నారు. అసబుద్దీన్ పెయింటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు. అసబుద్దీన్ భార్యా ఆసియా ఖాతూన్ ప్రస్తుతం నిండు గర్భిణి. ఆసియాకు నెలలు నిండడంతో శుక్రవారం ఆమె సొంతూరైన బిలాస్ పూర్ కు తీసుకెళ్లాందుకు భర్త సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి రైలు కోసం నాంపల్లి రైల్వేస్టేషన్ కు వెళ్లారు.
అయితే రైలు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆసియా ఖాతూన్ కి పురిటీ నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులకు ఏమి చేయాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్న వారిని సాయం చేయమని ఆసియా కుటుంబ సభ్యులు కోరారు. అదే సమయంలో ఫ్లాట్ ఫామ్ నెం.3లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ స్పందించారు. అంతేకాక తోటి రైల్వే పోలీసులు కూడా వెంటనే అవసమైన సామాగ్రిని సమకూర్చారు. దీంతో కానిస్టేబుల్ కళ్యాణి ఆ మహిళకు ప్రసవం చేసింది. ఆసియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
సకాలంలో స్పందించి సాయం చేసిన కానిస్టేబుల్ కళ్యాణికి, ఇతర పోలీసులకు ఆసియా ఖాతూన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. తరువాతి వైద్య చికిత్సల నిమిత్తం రైల్వే ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ అంబులెన్స్‌ను పిలిపించి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కాగా సకాలంలో స్పందించి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీసులను స్థానికులు అభినందించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.