పరీక్షలంటే చాలు పిల్లల్లో అదో పెద్ద టెన్షన్. బాగా చదివేవారు కూడా ఎగ్జామ్స్ టైమ్‌లో ఆందోళన పడుతుంటారు. కొంతమంది పిల్లలైతే పరీక్షల గురించి అతిగా ఆలోచిస్తూ సరిగ్గా భోజనం చేయరు. తీవ్ర ఒత్తిడికి కూడా లోనవుతారు. అదే సమయంలో వారిని మంచిగా మోటివేట్ చేస్తే చాలా ఎనర్జీ ఫీల్ అవుతారు. పెద్దోళ్లు కాస్త ధైర్యం ఇస్తే చాలు.. ఏ భయం లేకుండా పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. అలాంటిది స్వయంగా దేశ ప్రధానే వారికి సూచనలు, సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తే ఫలితాలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో కదా! పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో స్టూడెంట్స్‌లో ఒత్తిడిని తొలగించేందుకు ప్రధాని మోడీ శుక్రవారం విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ‘పరీక్షా పే చర్చ’లో ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో మోడీకి ఓ తెలంగాణ విద్యార్థిని నుంచి ప్రశ్న ఎదురైంది.
రంగారెడ్డి జిల్లా, జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన అక్షర అనే విద్యార్థిని.. మోడీని క్వశ్చన్ చేసింది. బహు భాషలపై పట్టు సాధించేందుకు ఏం చేయాలని అడిగింది. దీనికి మోడీ బదులిస్తూ ఓ ఉదాహరణను వివరించారు. ‘కార్మికులు ఉండే ఒక బస్తీలోని ఓ ఎనిమిదేళ్ల చిన్నారి.. హిందీ, బెంగాళీ, మలయాళం, మరాఠీ, తమిళంలో అనర్గళంగా మాట్లాడి నన్ను ఆశ్చర్యపర్చింది. ఆ బాలికకు అన్ని భాషలు ఎలా తెలుసా అని ఆరా తీశా. ఆ చిన్నారి ఇంటి పక్కన ఉండే వ్యక్తులు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారని తెలిసింది. ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చిన వారంతా ఒక చోట నివాసం ఉండటంతో ఆ బాలిక రోజూ వారితో మాట్లాడేది. దీంతో ఆమెకు అన్ని భాషలు వచ్చాయి. భాష నేర్చుకోవాలి, అన్ని భాషల్లో మాట్లాడాలనే ఆమె చొరవ మెచ్చుకోదగినది. ఇతర భాషలు నేర్చుకోవాలంటే ఉండాల్సినది అర్హతలు కాదు.. తపన. అదొక్కటి ఉంటే చాలు’ అని మోడీ సమాధానం ఇచ్చారు.