దేశ వ్యాప్తంగా ఈ మద్య వరుసగా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వారు ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలి పోతున్నారు.. ఆస్పత్రికి తరలించే లోగా కన్నుమూస్తున్నారు. కొన్ని సమయాల్లో బాధితులకు సీపీఆర్ చేసి రక్షించిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా గుండెపోటు తో హఠాన్మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టుమని 30 ఏళ్లు కూడా నిండని వారు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్నారు. ఇప్పటికే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఈ మద్యనే నందమూరి తారకరత్న ఇలా ఎంతో మంది హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యువత హార్ట్ ఎటాక్ తో ఉన్నచోటనే కుప్పకూలిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఆస్పత్రికి తరలించేలోగా కన్నుమూస్తున్నారు. తాజాగా ఓ ప్రయాణీకుడు గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ ఘటన వరంగల్ బస్టాండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
వరంగల్ బస్టాండ్ లో ఓ ప్రయాణీకుడు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంలో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆర్టీసీ సిబ్బంది, తోటి ప్రయాణీకులు పోలీసులకు, అంబులెన్స్ కి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ బాబు లాల్ వెంటనే బస్టాండ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రామరావు, సిబ్బందికి విషయం తెలియజేశాడు. వెంటనే ఎస్సై తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వైద్య విద్యార్థిని, ట్రాఫిక్ పోలీసులు ఆ ప్రయాణీకుడికి సీపీఆర్ చేశారు. అనంతరం అంబులెన్స్ సిబ్బంది వచ్చి బాధితుడిని వరంగల్ ఎంజీఎం కి తరలించారు. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్లుగా ధృవీకరించారు వైద్యులు. సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో అందరూ విచారం వ్యక్తం చేశారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా హార్ట్ ఎటాక్ రావడంతో పలువురు యువకులు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. వారం క్రితం హైదరాబాద్ అరాంఘర్ చౌరస్తాలో ఓ యువకుడు హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయాడు.. అక్కడే విధులు నిర్వహిస్తున్నా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అతనికి వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు పోశాడు. అలాగే జయశంకర్ భూపాలపల్లిలో కూడా అచ్చం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయాడు.. అక్కడే ఉన్న కిరణ్ అనే కానిస్టేబుల్ ఆ యువకుడికి పావుగంట సేపు సీపీఆర్ చేసి శ్వాస వచ్చేలా చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల హఠాత్తుగా గుండెపోటు వస్తే సీపీఆర్ చేసి ఎలా రక్షించాలన్న విషయంపై అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు.