సర్కారీ బస్సులో హాయిగా స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు జేసీబీలపై డేంజర్ జర్నీలు చేస్తున్నారు. స్కూడెంట్స్కు స్కూల్ బస్‌గా మారాయి జేసీబీలు. ఇది ఎక్కడ జరిగిందంటే..!
అదో మారుమూల ప్రాంతంలోని పల్లె. ఆ గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. ఆటోలు కూడా అక్కడ నడవవు. దీంతో ఆ ఊరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దలే కాదు పిల్లలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్కూలుకు వెళ్లాలంటే నడక తప్ప మరో మార్గం లేదు. బడికి పోవాలంటే కొంత దూరం నడక.. మరికొంత దూరం జేసీబీపై ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. పెను ప్రమాదమని తెలిసినా తప్పకపోవడంతో దాదాపు 6 కిలో మీటర్లు జేసీబీ మీద డేంజర్ జర్నీలు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. సుదూరంలో ఉన్న స్కూలుకు సరైన టైమ్‌కు చేరాలంటే వారికి ప్రతి రోజూ సాహసయాత్ర చేయక తప్పట్లేదు.
సర్కారీ బస్సుల్లో హాయిగా స్కూళ్లకు పోవాల్సిన అరిగోస పడుతున్నారు. నిర్మల్ జిల్లా కనకాపూర్ ప్రభుత్వ స్కూలు విద్యార్థులు స్కూలుకు వెళ్లేందుకు రోజూ ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. ముధోల్ మండలంలోని చింతకుంట నుంచి లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గవర్నమెంట్ స్కూలుకు 6 కిలో మీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ రూట్లో బస్సు, ఇతర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లలు జేసీబీలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదకరమని తెలిసినా తప్పట్లేదని అంటున్నారు. ఈ రోడ్డు మార్గం అంతా గుంతలమయంగా ఉండటంతో ఏదైనా అనర్థం జరిగితే బాధ్యులు ఎవరని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ మార్గంలో బస్సు నడపాలని డిమాండ్ చేస్తున్నారు.