తెలుగు ఇండస్ట్రీలో నందమూరి హీరోలు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయులు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత బాలకృష్ణ టాప్ హీరోగా చెలామణి అయ్యారు. ఓ వైపు హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతూనే హీరోగా వెండితెరపై తన సత్తా చాటుతున్నారు బాలకృష్ణ.
సాధారణంగా హీరోలు తమ ఫ్యాన్స్ కి ఏ చిన్న కష్టమొచ్చినా వెంటనే ఆదుకుంటారు. రీల్ లైఫ్‌లోనే కాక రియల్ లైఫ్‌లోను గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నారు. తాజాగా దానగుణంలో ముందుండే నందమూరి బాలకృష్ణ తాను రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోనేని మరోసారి నిరూపించుకున్నారు. ఓ చిన్నారికి క్యాన్సర్ చికిత్స చేయించేందుకు బాలయ్య ముందుకు వచ్చారు. హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే పాప క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బసవతారకం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆమె చికిత్స కోసం రూ.7లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు దాతల సాయం కోరారు. చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయంతో లక్షా 80 వేల వరకూ డబ్బులు సేకరించారు. మిగతా మొత్తం సర్ధుబాటు చేయలేని పరిస్థితులలో మణిశ్రీ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో బాలకృష్ణ అభిమాని సంఘం అధ్యక్షుడిని కలిసి పరిస్థితిని వివరించారు.
బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మణిశ్రీ పరిస్థితి గురించి బాలయ్య దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే బాలకృష్ణ స్పందించి పాపా ఆపరేషన్ కు కట్టాల్సిన 5 లక్షల 20 వేల రూపాయలు మాఫీ చేయించారు. అంతేకాదు చిన్నారికి తగిన చికిత్స అందించమని వైద్య సిబ్బందికి చెప్పారు. తాజాగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ ‘అఖండ’ మూవీలో నటిస్తున్నారు. తర్వాత డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు. తాజాగా బాలయ్య చేసిన మంచిపనికి అభిమానులు సంతోషం తెలియజేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.