నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని వేమూరీ ఎన్ క్లేవ్‌లో జీవన్‌రెడ్డి ఇంటివద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతూ కనిపించడంతో అది గమనించిన ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని హత్యచేసేందుకు కుట్ర పన్నిన వ్యక్తి ప్రసాద్ గౌడ్ గా పోలీసులు గుర్తించారు. ఆయన వద్ద వద్ద కత్తి, పిస్టల్ ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఇటీవల తన భార్యని సర్పంచ్ పదవి నుంచి తొలగించేందుకు ముఖ్య కారణం ఎమ్మేల్యే జీవన్ రెడ్డి అని అక్కసు పెంచుకున్న ప్రసాద్ గౌడ్ ఆయనను చంపేందుకు కుట్రపన్నినట్లు తెలుస్తుంది.
ప్రసాద్ గౌడ్ కొనుగోలు చేసిన తుపాకీ ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నింధితుడిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని, అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బంజారాహిల్స్ పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.