కరోనా మహమ్మారిని తట్టుకుని నిలబడటం సామాన్య ప్రజల వల్ల కావడం లేదు. ఇప్పటికే దేశం అన్ని విధాలా నష్టపోయింది. అయిన వారిని, ఆస్తులని కోల్పోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో దేశంలోని అన్నీ రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇందుకు తెలుగు రాష్ట్రాలు అతీతం కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం 12 తరువాత పూర్తిగా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలంగాణలో కూడా రాత్రి 9 తరువాత కర్ఫ్యూ కొనసాగుతోంది. కానీ.., వీటి వల్ల వైరస్ చైన్ ఏ మాత్రం బ్రేక్ కావడం లేదు. ఇంకా కూడా రోజుకి వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ దిశగా ఆలోచనలు చేస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి చైనా నుండి అమెరికా వరకు, యూకే నుండి ఆఫ్రికా దేశాల వరకు.. అన్నీ దేశాలు కూడా లాక్ డౌన్ చేశాకే వైరస్ పై విజయం సాధించాయి. ఒక్కసారి ఈ చైన్ బ్రేక్ అయ్యాక.., వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతమైతే మంచి ఫలితాలను సాధించవచ్చు. కానీ.., మన దేశంలో మాత్రం లాక్ డౌన్ విషయంలో కేంద్రానిది ఒక దారైతే రాష్ట్ర ప్రభుత్వాలది ఓ దారి అయ్యింది. లాక్ డౌన్ విషయంలో ఎవ్వరికీ ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది. ఇక ప్రధానంగా లాక్ డౌన్ కారణంగా ఏర్పడే ఆర్ధిక లోటును భరించడానికి ప్రభుత్వాలు గాని, సామాన్య ప్రజలు గాని సిద్ధంగా లేకపోవడంతో ఇప్పటికీ చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ ఆఖరి అస్త్రంగా మారిపోయింది. కానీ.., తెలంగాణలో కోవిడ్ కేసులు అమాంతం పెరిగిపోతు ఉండటంతో లాక్ డౌన్ కి సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు మే15 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జజరుగుతున్నాయట. కేబినెట్ లో చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికి ఇప్పుడు లాక్ డౌన్ విధించి ప్రజల్లో హడావుడి పెంచే కన్నా.. వారు కాస్త కుదుట పడేలా నాలుగు రోజులు గ్యాప్ ఇవ్వాలన్న ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లోపు ముస్లింలకు అతి ముఖ్యమైన రంజాన్ కూడా అయిపోతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ డేట్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి తెలంగాణలో కోవిడ్ టెస్ట్ చాలా తక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. ఇక వైద్య సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పైగా.., తెలంగాణలో వ్యాక్సినేషన్ పక్రియ ఊపందుకుంది లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి.. లాక్ డౌన్ కి వెళ్లడమే సరైన చర్యగా ప్రభత్వం భావిస్తుందని సమాచారం. మరి రానున్న కాలంలో ఏమి జరుగుతుందో చూడాలి.