మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇందుకోసం కొంతమంది వాకింగ్ చేస్తే మరికొంత మంది ఇంట్లో ట్రెడ్ మిల్ ఉపయోగిస్తుంటారు. ఇంటివద్దనే వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేసే వెసులుబాటును ట్రెడ్ మిల్ అందిస్తుంది. ఈ ట్రెడ్ మిల్ లో మోటార్, కన్వేయర్ బెల్టు, ప్లాట్ ఫాం, డిజిటల్ కన్సోల్ వంటి భాగాలుంటాయి. ఇది కరెంట్ తో నడుస్తుంది.. దీని ధర మార్కెట్ లో రూ.15 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటాయి. అయితే వెనుకటికి కాలంలో కరెంట్, మర మగ్గాలు లేనప్పుడు చేనేతలు, వండ్రంగి, కంసాలి ఇలా ఎందరో ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఏ మారుమూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. వారి ప్రతిభ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఓ వడ్రంగి వినూత్న ఆవిష్కరణ చేశాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ వడ్రంగి కేవలం చెక్కల సాయంతో కరెంట్ అవసరం లేకుండా వాకింగ్ చేసేలా ఒక క్రమపద్ధతిలో వాటిని ఎత్తు నుంచి దిగువకు అమర్చి అద్భుతంగా ట్రెడ్ మిల్ తయారు చేశాడు. ఈ వుడెన్ ట్రెడ్ మిల్ అచ్చం మిషిన్ ట్రెడ్ మిల్ లానే పనిచేస్తుండడం విశేషం. పైగా ఇది నడిచేందుకు ఎలాంటి పవర్ అవసరంలేదు. ఈ వీడియోను చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ అచ్చెరువొందారు. “వావ్” అంటూ ట్విట్టర్ లో తన స్పందన వెలిబుచ్చారు. ఆ వ్యక్తి వివరాలు తెలుసుకోవాలని తెలంగాణ నూతన ఆవిష్కరణల ప్రోత్సాహక విభాగం టి వర్క్స్ కు సూచించారు. ట్రెడ్ మిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి ప్రతిభకు అందరూ ఫిదా అయిపోతున్నారు.
Wow! 👏👏 @TWorksHyd please connect & help him scale up https://t.co/FVgeHzsQx8
— KTR (@KTRTRS) March 18, 2022