ప్రీతి ఘటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రీతి ఘటనను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. ప్రీతి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రీతి మరణానికి కారణమైన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ డిమాండ్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రీతి ఘటనపై స్పందించలేదని వస్తున్న విమర్శలకు కేటీఆర్ సమాధానమిచ్చారు.
ప్రీతి ఘటనను రాజకీయం చేస్తున్నారని ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రతీ చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ ఎంజిఎం కాలేజ్ లో చదువుతున్న డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజ్ లో జరిగిన గొడవలో ర్యాగింగ్ కి గురై, మనస్తాపానికి గురై చనిపోయింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ అమ్మాయి చనిపోతే బాధపడ్డామని, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు వెళ్లి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించారని అన్నారు. ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా మా అందరి తరపున, పార్టీ తరపున, ప్రభుత్వం తరపున సంతాపం తెలియజేశారు. తాము ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అన్ని రకాలుగా ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రీతికి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా సరే వదిలిపెట్టమని, చట్టపరంగా, న్యాయపరంగా శిక్ష వేస్తామని అన్నారు. తప్పు చేసిన వాళ్ళు సైఫ్ అయినా, సంజయ్ అయినా వదిలిపెట్టమని కేటీఆర్ స్పష్టం చేశారు.