ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం. సొంతవాళ్ల గురించే ఆలోచించే తీరక ఉండటం లేదు. సాధారణ ప్రజల పరిస్థితే ఇలా ఉంటే.. మరి రాజకీయ నాయకుల సంగతి ఏంటి? ఒక కేంద్రమంత్రి ఎంత బిజీగా ఉంటారు? ఆయన కుటుంబానికి ఎంత సమయం కేటాయిస్తారు? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉండచ్చు. లీడర్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందరికీ సుపరిచితులే. మరి.. ఒక భర్తగా, తండ్రిగా అయన ఎలా ఉంటారు అనే విషయాలు చాలా మందికి తెలీదు. అలాంటి ఆసక్తికర విషయాలను సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయన సతీమణి కావ్యారెడ్డి వెల్లడించారు. మరి ఆ వివరాలేంటో మీరూ చదివేయండి…
“మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మా చిన్నాన్న ఈ సంబంధం తీసుకొచ్చారు. అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పెళ్లి అనగానే వద్దు.. నేను చదువుకోవాలి, జాబ్ చేయాలి అని గోల చేశాను. పెళ్లిచూపుల్లో ఆయన నాతో మాట్లాడారు. పెళ్లి తర్వాత కూడా చదవుకోవచ్చు, జాబ్ చేయచ్చు మీ ఇష్టానికి అడ్డు చెప్పను అన్నారు. ఆ ఒక్క మాటతో ఆయనకి పడిపోయాను. కిషన్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పాను. మా నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య 8 నెలల గ్యాప్ ఉంది. నేను నా చదువు కంటిన్యూ చేశాను.”
“అప్పట్లో కొత్తగా అప్పుడే కంప్యూటర్ కోర్సులు స్టార్ట్ అయ్యాయి. దానికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. పెళ్లికి ముందే జరిగింది ఇది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజ్ కిషన్ రెడ్డి గారే కట్టారు. మా పేరెంట్స్ కడతాం అంటే వద్దని చెప్పి ఆయనే కట్టారు. సెంటర్ కి వచ్చి ఎగ్జామ్ కూడా రాయించారు. ఆ విషయంలో ఆయన వ్యక్తిత్వం చూసి చాలా సంతోషం అనిపించింది. మేము మొదటి నుంచి కలిసి పెద్దగా బయటకు వెళ్లింది లేదు. నిశ్చితార్థం- పెళ్లికి మధ్య ఉన్న 8 నెలల గ్యాప్ లో ఒక రెండు సినిమాలు చూసి ఉంటాం. అది కూడా నేను వెళ్లి గంటసేపు వెయిట్ చేస్తే తీసుకెళ్లేవాళ్లు(నవ్వుతూ). 1994లో మేము మొదటిసారి సినిమా చూసినట్లు గుర్తు.”
“మా పెళ్లి సమయంలోనే ఆయన యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. పెళ్లైన రెండోరోజే రాజస్థాన్ టూర్ కి వెళ్లిపోయారు. వారంలో మూడ్రోజులు మాత్రమే ఇంట్లో ఉండేవారు. అప్పటి వరకు నాకు రాజకీయాల గురించి అస్సలు తెలీదు. రాజకీయాల్లో ఉంటే ఇంత బిజీగా ఉంటారా అని అప్పుడే తెలుసుకున్నాను. పెళ్లైన కొత్తలో నాకు సమయం కేటాయించట్లేదు.. బయటకు తీసుకెళ్లడం లేదు అని ఒక భార్యగా బాధ పడేదాన్ని. నాలో నేను బాధపడేదాన్ని కానీ, ఆయనతో ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. వేరేవాళ్లతో కంపేర్ చేసి మాట్లాడటం, బాధపడ్డాను అని చెప్పడం చేసే దాన్ని కాదు. అదరితో పోలిస్తే మాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు. నేను ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలు, రెస్టారెంట్లకు వెళ్లినా ఏం అనరు. నాకు నచ్చినట్లు ఉండమని చెబుతారు.”
“నాకు చదువుకోవడానికి, జాబ్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చారు. రాజకీయ నాయకుడిగా ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటారు. నేను చదువు, జాబ్ అని వెళ్తే తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న నాకు నేను వేసుకున్నాను. అందుకే పీజీ ఫస్ట్ సెమిస్టర్ తర్వాత చదువు మానేశాను. నా సమయం మొత్తం నా కుటుంబానికే కేటాయించాలని అనుకున్నాను. అలాగే నేను ఈ పాతికేళ్లు హౌజ్ వైఫ్ గా ఉన్నాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. వాళ్లకి నా అవసరం అంత లేదు. అందుకే గతేడాది నుంచి నేను బయటకు రావడం, కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తున్నాను. నాకు దైవ చింతన ఎక్కువ. నాకు మొదటి నుంచి ఎదుటివారికి సాయం చేయాలి అని ఉండేది.”
“2017లో ఏవీబీ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. మా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. 20 వేల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ అందించాం. చాలా మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించాం. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, చెవిటి మెషిన్లు, కళ్లజోడ్లు పంపిణీ చేస్తుంటాం. మొదటి నుంచి నాకు సేవ చేయడం ఇష్టం. ఇన్నాళ్లకు నాకు ఆ అవకాశం దక్కింది. నాకు సాధ్యమైనంత వరకు సేవ చేస్తూ ఉంటాను.” అంటూ కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి వ్యాఖ్యానించారు. సుమన్ టీవీతో కావ్యారెడ్డి పంచుకున్న మరిన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకునేందుకు కిందనే ఉన్న వీడియోలో ఫుల్ ఇంటర్వ్యూ చూసేయండి.