వేటకు వెళ్లి కొండరాళ్ల మధ్య చిక్కుకుపోయిన రాజు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డాడు. 42 గంటల పాటు నరకయాతన అనుభవించిన అతడు మృత్యుంజయుడయ్యాడు. అధికారులు, మిత్రుడి పుణ్యమా అని ప్రాణాలు నిలుపుకున్నాడు. గురువారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అధికారులు అతడ్ని బయటకు తీసుకువచ్చారు. ప్రాణాపాయం లేకపోయినా.. శరీరంపై గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. రాజు కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తమ వాడు ప్రాణాలతో బయటకు రావటానికి ఎంతో కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాగా, కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం స్నేహితుడు మహేశ్‌తో కలిసి ఘన్‌పూర్ శివారు ప్రాంతంలోని అడవిలో వేటకు వెళ్లాడు. అడవిలో కొండరాళ్ల మధ్య తిరుగుతుండగా అతడి ఫోన్ రాళ్ల మధ్యలో పడిపోయింది. ఆ ఫోన్‌ను తీసుకోవటానికి రాజు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతడు కూడా రాళ్ల మధ్యలో పడిపోయాడు. ఇది గమనించిన మహేష్ అతడ్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు.
లాభం లేకపోవటంతో కుటుంబసభ్యులకు విషయం చెప్పాడు. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న కుటుంబసభ్యులు మిత్రులు బుధవారం మధ్యాహ్నం వరకు గట్టిగా ప్రయత్నం చేశారు. రాజు అడవిలో వేటకు వచ్చాడు కాబట్టి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బంది అవుతుందని వారు భావించారు. తమ వల్ల కాదని తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది చాలా కష్టపడ్డారు. రాజు మిత్రుడు అశోక్ బండరాళ్ల మధ్యలో ఉన్న రాజుకు నీళ్లు, ఓఆర్‌ఎస్ తాగించాడు. దాదాపు 42 గంటలు కష్టపడటంతో అతడు బయటకు వచ్చాడు.