ప్రపంచంలో ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. గ్లోబల్ వార్నింగ్ పై ఎన్ని రకాల చర్చలు నడుస్తున్నా.. ప్రజలు వాటిని పట్టించుకోకుండా తమ చుట్టూ వాతావరణాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు. భౌతిక, థర్మల్, జైవిక, రేడియోధార్మిక ధర్మాల్లో సంభవించే మార్పులు జీవుల ఆరోగ్యం, భద్రతకు హాని కలిగించే విధంగా ఉంటే దాన్ని కాలుష్యంగా పరిగణిస్తారు.
ప్రస్తుత సమాజంలో వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యలకు కాలుష్యమే ప్రధానమైన కారణం. రోజురోజుకు వాతావరణ కాలుష్యం అధికమవుతోంది. నగరాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. జనాలు స్వచ్ఛమైన గాలిని పీల్చడం గగనమవుతోంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగతో హైదరాబాద్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే నగరంలోని రెండు ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి లభిస్తోందట. వాటిలో ఒకటి జూబ్లీహిల్స్ కాగా… రెండోది ఉప్పల్ అని తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్ పీసీబీ) వెల్లడించింది. తన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఈ విషయాన్ని తెలిపింది.
ఈ నెల 7న జూబ్లీహిల్స్, ఉప్పల్ లో 30 నుంచి 50 మధ్య గాలి నాణ్యత నమోదయింది. రెండు ప్రాంతాలతో పాటు ప్యారడైజ్, బాలానగర్, చార్మినార్ ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత బాగుందని పీసీబీ తెలిపింది. అయితే జీడిమెట్లలో గాలి నాణ్యతలో ఎలాంటి మార్పు లేదు. ఇక గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే దాన్ని గుడ్ అని పరిగణిస్తారు. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరమని.. 101-200 మధ్య ఉంటే ఓ మాదిరి అని.. 201-300 మధ్య ఉంటే పూర్ అని.. 301-400 మధ్య ఉంటే వెరీ పూర్.. 400 లోపు ఉంటే తీవ్రమని పేర్కొంటారు. జూబ్లీహిల్స్ లో పచ్చటి వాతావరణం ఉంటుంది.. అయితే ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పటికీ ఎయిర్ క్వాలిటీ బాగుందని తెలిపింది.