ఈ మద్య కొంత మంది క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో అనర్థాలకు పాల్పపడుతున్నారు. ఆ తర్వాత తాము చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడుతున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థాలు, నష్టాలు జరిగిపోతున్నాయి. భార్యాభర్తల మద్య చిన్న చిన్న గొడవలు చివరికి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి భార్యపై గొడవ పడి తన ఇంటినే కాల్చుకున్న ఘటన అత్తాపూర్ ఔట్ పోస్ట్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. . అత్తాపూర్ ఔట్ పోస్టు పరిధిలోని కాలనీలో మస్తాన్, సమీరా దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. పెళ్లైన మొదట్లో బాగానే ఉన్నా ఈ మద్య వారి మద్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అర్ధరాత్రి భార్యాభర్తల మద్య స్వల్ప వివాదం తలెత్తింది. చివరకు ఘర్షణకు దారితీసింది. కోపోద్రికుడైన భర్త మస్తాన్ ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఆ సమయంలో భార్య సమీరా ఎంత చెప్పినా.. వారించినా మస్తాన్ వినిపించుకోకుండా పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించాడు. దాంతో ఇంట్లో వున్న విలువైన వస్తువులు, బట్టలు, సామాగ్రి పూర్తిగా దగ్ధం అయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోయినా.. విలువైన వస్తువులు తగలబడటంతో భార్య సమీరా కన్నీటిపర్యంతం అయ్యింది. మస్తాన్ అర్ధరాత్రి అకారణంగా తనతో గొడవ పడి.. కోపంతో ఇంట్లో పెట్రోల్ పోసి తగల బెట్టాడంటూ ఫిర్యాదు లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.