ఆదర్శ దంపతులుగా ఉండాల్సిన వారు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఇతర వ్యక్తులపై వ్యామోహంతో చేయరాని తప్పులు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. మరీ ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.
ఆదర్శ దంపతులుగా ఉండాల్సిన వారు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఇతర వ్యక్తులపై వ్యామోహంతో చేయరాని తప్పులు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. మరీ ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. సంతోషంగా సాగిపోతున్న దంపతుల జీవితాల్లో మూడో వ్యక్తి చేరడంతో జీవితాలను, కుటుంబాలను అంధకారం చేసుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కలకాలం కలిసి జీవించాల్సిన భర్తను కాటికి పంపిస్తున్నారు. లేని ప్రేమను ఒలకబోస్తూ ప్రియుడితో కలిసి భర్తలను హతమారుస్తున్నారు. ఇదే రీతిలో ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హతమార్చింది. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
భర్తపై కపట ప్రేమను చూపిస్తూ జీడితోటలోకి తీసుకెళ్లి ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల ఎంట్రీతో ఆమె అసలు రంగు బయటపడి కటకటాలపాలైంది. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన గుడివాడ అప్పలనాయుడు (33), జానకి (24) భార్యాభర్తలు. కాయకాష్టం చేసుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. కొంత కాలం తర్వాత వీరి జీవితాల్లోకి మరో వ్యక్తి ఎంటరయ్యాడు.
జానకికి పాతకృష్ణదేవిపేటకు చెందిన తాపీమేస్త్రి చింతల రాము (34)తో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి వీరిద్దరు తరచుగా ఫోన్లో మాట్లాడుకోవడం, గుట్టుగా కలుసుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి వ్యవహారాన్ని పసిగట్టిన భర్త అప్పలనాయుడు.. జానకిని పనికి వెళ్లొద్దని చెప్పాడు. ఇది జీర్ణించుకోలేని జానకి తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను మట్టుబెట్టేందుకు ప్రియుడితో కలిసి పథకం వేసింది.
దీనిలో భాగంగానే ఈ నెల 20న కోటవురట్ల మండలం పాములవాకలోని పట్టాలమ్మతల్లి గుడికి వెళ్దామని చెప్పి భర్తను తీసుకువెళ్లింది జానకి. దర్శనం అనంతరం తిరిగి వస్తూ మార్గమధ్యలో తాండవ నది గట్టు దాటాక బహిర్భూమికి వెళ్లాలంటూ భర్తతో చెప్పింది. తన పథకాన్ని అమలు పరిచేందుకు రోడ్డుపక్కన జీడితోటలోకి భర్తను తీసుకువెళ్లింది. తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని భర్తతో చెప్పి భర్తను తన ఒడిలో తలవాల్చమని చెప్పింది జానకి. భార్య ప్రేమకు ముగ్దుడైన అప్పలనాయుడు ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. అప్పటికే తోటలో కాపు కాస్తున్న ప్రియుడు రాము అప్పలనాయుడు తలపై సుత్తితో గట్టిగా కొట్టాడు. తీవ్రగాయం కాగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు జానకి భర్త.
జానకి ఆమె ప్రియుడు ఇద్దరు కలిసి అప్పలనాయుడి డెడ్ బాడీని రోడ్డుపైకి చేర్చారు. ఆ తరువాత ప్రియుడు అక్కడి నుంచి పరారు కాగా జానకి అక్కడే ఉండి తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. అటుగా వెళ్తున్న వారు అనుమానపడి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో జానకి ఆమె ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది. దీంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.