గుండెపోటు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవర పెడుతోంది. ఎందుకంటే గతంలో అంటే 60 ఏళ్లు దాటిన వారికి, అదీ ఊబకాయం ఉన్న వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ గుండెపోటు వస్తోంది.
వైద్యో నారాయణో హరీ అంటారు. ఎందుకంటే ప్రాణం కాపాడగలిన వైద్యులు కూడా దేవుడితో సమానం అని. ఇప్పుడు కానిస్టేబుల్ రాజశేఖర్ కూడా ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి ఆ కుటుంబానికి దేవుడిగా మారాడు. రోడ్డు మీద గుండెపోటుతో పడిపోయిన బాలరాజుకు సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అందరిలా మనకెందుకులే అనుకోకుండా తక్షణమే స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మంత్రి హరీశ్ రావు సైతం రాజశేఖర్ చేసిన పనిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అతను ఎంతో గొప్ప పని చేశాడంటూ చెప్పుకొచ్చారు.
రాజేంద్రనగర్ పరిధి ఆరంఘర్ లో ఉదయం బాలరాజు ఒక్కసారిగా కుప్పకూలాడు. ముందు అందరూ చూసి ఫిట్స్ అనుకున్నారు. కానీ, బాలరాజులో చలనం లేకపోవడంతో రాజశేఖర్ అది గుండెపోటుగా భావించి వెంటనే అతనికి సీపీఆర్ చేశాడు. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత బాలరాజు స్పృహలోకి వచ్చాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలరాజు ఆరోగ్యంగా ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. రాజశేఖర్ చేసిన పనిని మంత్రి హరీశ్ రావు మెచ్చుకున్నారు. అంతేకాకుండా ఈ ఘటనను ఉదాహరణగా తీసుకుని ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టనున్నారు.
ప్రాణం కాపాడిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్
రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో బాలరాజు అనే వ్యక్తికి గుండెపోటు రాగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సిపిఆర్ చేసి ప్రాణం కాపాడాడు. ఇప్పుడు బాలరాజు సురక్షితంగా ఉన్నారు. pic.twitter.com/vDH3zdd6gm
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 24, 2023
‘రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ చేసిన పని ప్రశంసించి తీరాల్సింది. సీపీఆర్ చేసి మనిషి ప్రాణాలు కాపాడటం ఎంతో గొప్ప విషయం. గుండెపోటులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చేవారం ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఉద్యోగులు ప్రభుత్వం సీపీఆర్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించనుంది” అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంపై పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లో జిమ్ లో విశాల్ అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించిన విషయాన్ని ఉదాహరణగా చెబుతూ.. సాధారణ ప్రజలకు కూడా సీపీఆర్ ట్రైనింగ్ ఇవ్వాలంటూ కోరుతున్నారు. అక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నా కూడా వారు ఎవరూ సీపీఆర్ చేయక విశాల్ ప్రాణాలు కోల్పోయారంటూ కామెంట్ చేస్తున్నారు. మంత్రి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Highly Appreciate traffic police Rajashekhar of Rajendranagar PS for doing a commendable job in saving precious life by immediately doing CPR. #Telangana Govt will conduct CPR training to all frontline employees & workers next week inview of increasing reports of such incidents pic.twitter.com/BtPv8tt4ko
— Harish Rao Thanneeru (@BRSHarish) February 24, 2023