ఏప్రిల్, మే నెలలో ఎండలు దంచికొడతాయి.. కానీ ఈ మద్య వాతావరణంలో విచిత్రమైన మార్పులు సంభవించి అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో పంటలు నెలమట్టమైన రైతులు లబోదిబో అంటున్నారు.
సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండలు దంచికొడతాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.. రోడ్లన్నీ నిర్మాణుశ్యంగా ఉంటాయి. ప్రజలు ఎక్కడ నీడ దొరికితే అక్కడికి చేరుకుని సేద తీరుతారు. అలాంటిది గత నెల నుంచి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ఉదయం ఎండ దంచికొడితే.. సాయంత్రం వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలతో రైతులు అతలాకుతలం అవుతుంటే.. మరో మూడు.. నాలుగు రోజులు భారీగా వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా వానలు దంచికొడుతున్నాయి. మూడురోజుల నుంచి వాతావరణం చల్లబడిపోయింది.. ఈదురుగాలులతో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడు రోజుల్లో వడగండ్ల వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ చత్తీస్ గఢ్ వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల మరో ముడు రోజుల వరకు పలు జిల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల వడగండ్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. 40 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని.. సోమవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, నల్లగొండ, నాగర్ కర్నూల్ ఇతర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వడగండ్ల వర్షాల కారణంగా పంటలు నేలపాలయ్యాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ అంతటా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి.. ఏ క్షణంలో అయినా భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.. ప్రజలు అత్యవసర పనులు అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.