ఒకప్పుడు హైదరబాద్ రోడ్లపై తిరిగి డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ సందడి చేయబోతున్నాయి. రెండు దశాబ్ధాల క్రితం గ్రేటర్ లో పరుగులు పెట్టిన డబుల్ డెక్కర్ బస్సులు నిర్వహణ భారంతో ఒక్కొక్కటిగా సర్వీస్ నుంచి తప్పించారు. అలా కొంత కాలం తర్వాత ఈ బస్సులు పూర్తిగా ఆపివేశారు. దాంతో ఈ తరం వారికి ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు అంటే ఫోటోలో చూడటం మాత్రమే జరిగింది. మళ్లీ ఇంత కాలం తర్వాత ఈ బస్సులు నగర రోడ్లపై పరుగులు పెట్టేందుకు సిద్దమవుతున్నాయి. వచ్చే సంవత్సరానికి పది డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్ లో ప్రయాణీకుల రద్ది రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు శుభవార్త తెలిపింది టీఎస్ఆర్టీసీ. త్వరలో హైదరబాదల్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రణాళీకలు రూపొందిస్తున్నారు. గత కొంత కాలంగా సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు తిప్పాలంటూ మంత్రి కేటీఆర్ కి నెటిజన్లు విజ్ఞప్తులు చేస్తునే ఉన్నారు. అప్పట్లో నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు నడిపిస్తామని మంత్రి కేటీఆర్ సైతం హామీ ఇచ్చారు. ఈ విషయం గురించి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి కూడా తీసుకు వచ్చారు. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తిప్పేందుకు చర్యలు ప్రారంభించింది. అయితే ఈసారి అన్ని సౌకర్యాలతో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనుంది.
నగరంలో పది ఇ-డబులు డెక్కర్ బస్సుల్ని అద్దెకు తీసుకొని నడిపేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ మరో వారంలో టెండర్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. బిడ్ గెలుచుకున్న కంపెణీలు అద్దే ప్రాతికపదికన టీఎస్ ఆర్టీసీతో ఒప్పందాలు జరపనున్నాయి. ఈ క్రమంలో మొదట పది ఇ-డబుల్ డెక్కర్ బస్సులను నడిపించి క్రమేపి పెంచుకుంటూ వెళ్లాలనే ఆలోచనలో టీఎస్ ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ ప్రతిపాదన రావడం.. టెండర్లు పిలవడం కూడా జరిగింది. మొదట అశోక్ లే ల్యాండ్ సంస్థ ద్వారా కొనుగోలు చేయాలని భావించినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వెనక్కి తగ్గారు.
పూర్తి దేశీయ పరిజ్ఞాంతో ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ భారత్ లోనే డిజైన్ చేయడం మరో విశేషం. త్వరలో హైదరాబాద్ లో నడపబోయే ఇ-డబుల్ డెక్కర్ బస్సులు అద్దె ప్రాతిపదికన తీసుకోవడం గమనార్హం. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు విశ్వనగర కీర్తి పెంపొందేలా రవాణా వ్యవస్థ ఉండాలనే ఉద్దేశ్యంతో డబుల్ డెక్కర్ బస్సులు నడిపించే ఆలోచనలో టీఎస్ఆర్టీసీ భావిస్తుంది. ఈ బస్సులు ఫ్లై ఓవర్ లేని చోటు ఇతర ఇబ్బందులు లేకుండా ఫ్రీగా ఉన్న చోట్ల నడిపించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతానికి 3 రూట్లు ఫైనల్ చేసినట్లు సమాచారం. ముంబై వంటి మహానగరాల్లో ఇప్పటికీ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతన్నాయి.