పదవ తరగతి విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. పరీక్షలు సులువుగా రాసేలా విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. పరీక్ష పేపర్లలో ఇది వరకూ ఉన్న ఇంటర్నల్ ఛాయిస్ ను తొలగించి దాన్ని మరింత సరళీకృతం చేసింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు ఎంతో సమయం లేదు. పరీక్షల తేదీ దగ్గర పడుతుండడంతో శుక్రవారం నుంచి హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది విద్యాశాఖ. స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ నుంచి లేదా నేరుగా ఈ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనుండగా.. పరీక్షలు రాసేందుకు 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఈసారి పదో తరగతి పరీక్ష పేపర్లలో వ్యాసరూప ప్రశ్నల సెక్షన్ లో ఛాయిస్ పెంచారు. 6 ప్రశ్నల్లో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే చాలని విద్యాశాఖ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది.
డిసెంబర్ 28న వచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. వ్యాసరూప క్వశ్చన్స్ సెక్షన్ లో అంతకు ముందు ఇంటర్నల్ ఛాయిస్ మాత్రమే ఉంది. అంటే ప్రతీ ప్రశ్నలో ఏ లేదా బీ అని రెండు ప్రశ్నలు ఇస్తే.. వాటిలో ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉండేది. అయితే దీనిపై అటు టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వచ్చింది. 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా ఆన్ లైన్ క్లాసులకు మాత్రమే హాజరవ్వడంతో విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యం తగ్గిందని.. పరీక్ష నమూనాలో మార్పులు చేయాలని, ఛాయిస్ పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి చేశారు. దీంతో విద్యాశాఖ తాజాగా ఇంటర్నల్ ఛాయిస్ ను తొలగించి.. 6 ప్రశ్నల్లో 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని పేర్కొంది.
ఈ కారణంగా మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల కేటాయింపు మారింది. అయితే ఈ మార్పు తెలుగు, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టులకు ఉండదు. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు మాత్రమే ఉంటుంది. అది కూడా ఏప్రిల్ లో జరిగే వార్షిక పరీక్షలతో పాటు 2023-24 అకడమిక్ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మార్పులు 9వ తరగతి పరీక్షలకు కూడా వర్తిస్తాయని తెలిపింది. కాగా ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకూ జరగనున్న పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అలానే పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.