ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టీక్ ప్రభావంతో భూమిపై నివసించే ప్రాణులన్నింటికి ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం వాడే ప్లాస్టిక్ ఉత్పత్తులు ఒక్కసారి మాత్రమే వినియోగించదగినవి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని.. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమం మొదలు పెట్టారు. గ్రామంలో ఎవరైనా సరే ప్లాస్టీక్ ని సేకరించి ఇస్తే.. వారికి బహుమతిగా వెండి నాణేలు ఇస్తున్నారు. దీని వల్ల ప్లాస్టీక్ అనేది గ్రామంలో ఎక్కడా కనిపించకుండా ఉండాలనేది తమ ప్రయత్నం అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షరసాగర్ గ్రామం.. కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొన్యాల బాల్ రెడ్డి, ఎంపీటీసీ మమతా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఎవరైనా సరే 10 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి తెచ్చి ఇస్తే.. వారికి తులం వెండి నాణెం బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ప్లాస్టీక్ వ్యర్థాలను తూకం వేసేందుకు స్థానిక గ్రామ పంచాయితీ వద్ద కాంటా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ప్లాస్టిక్ వ్యర్థాలకు వెండి నాణెం బహుమతి అనడంతో గ్రామస్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఇప్పటికే 400 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించినట్లు కొన్యాల బాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ స్వచ్ఛభారత్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని.. పరిశుభ్రతకు పెద్దపీట వేసుకున్నామని.. గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం తాము చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు.
నేటి ఆధునిక కాలంలో మానవుడికి ప్లాస్టిక్ తో విడదీయరాని బంధం ఏర్పడింది.. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ప్లాస్టిక్ ని ఏదో ఒక రకంగా వాడుతూనే ఉన్నారు. ప్లాస్టీక్ వస్తువులు లేకుండా మానిషి జీవనం కష్టసాధ్యం అన్నంతగా మారిపోయింది. పుట్టిన పసిపాపకు పాలపీక మొదలు వంటింట్లో ఏన్నో రకాల ప్లాస్టిక్ పరికరాల వాడకం నిత్యకృత్యం అయ్యింది. అయితే ప్లాస్టిక్ మానవాళి మనుగడకు, పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం వల్ల భూమిపై నివసించే ప్రాణులన్నింటికి ఎంతో ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అదేవిధంగా ప్లాస్టీక్ వినియోగం తగ్గించాలని పెద్ద ఎత్తున విప్లవం జరుగుతుంది.