వర్షాకాలం మొదలైంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. ప్రకృతి పచ్చ చీర కట్టి రమణీయంగా కనిపిస్తుంది. దీంతో వీకెండ్స్, ఇతర సెలవులు వస్తే.. అలా ట్రెక్కింగ్ లేదా పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్లాన్ వేసుకుంటారు.
వర్షాకాలం మొదలైంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. ప్రకృతి పచ్చని చీర కట్టి రమణీయంగా కనిపిస్తుంది. దీంతో వీకెండ్స్, ఇతర సెలవులు వస్తే.. అలా ట్రెక్కింగ్ లేదా పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్లాన్ వేసుకుంటారు. ముఖ్యంగా ఎత్తైన కొండల నుండి జాలువారే జలపాతాలను కళ్లారా చూసేందుకు ఇష్టపడుతుంటారు పర్యావరణ ప్రేమికులు. వీటిని చూసేందుకు క్యూ కడుతుంటారు. ఈ క్రమంలో కొంత మంది యువత ఆ చలిని, ఆ వాతావరణాన్ని ఆస్వాదించేందుకు మందు తీసుకెళ్లడం.. తాగేసి బాటిళ్లను పడేయడం, తాగిన మత్తులో వీరంగం సృష్టించడం చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణాన్ని దెబ్బతీయడమే కాకుండా.. ఇతర పర్యాటకులను భయాందోళనకు గురి చేస్తున్నారు.
తెలంగాణ మెడలో తెల్లటి హారం ఈ బోగత వాటర్ ఫాల్స్. ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి ప్రాంతంలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ రెండు తెలుగు రాష్ట్రాలను అలరిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో మరింత అందంగా కనువిందు చేస్తూ ఉంటూంది. ఫ్రెండ్స్‌తో కలిసి బోగత వాటర్ ఫాల్స్ వెళ్దామని చుక్క, ముక్క సిద్ధం చేసుకుంటున్నారా.. ఆగండీ.. ఇది చదివి బయలుదేరండి. అలా ఎంజాయ్ చేద్దామంటే ఇక ఆ పప్పులేమీ ఉడకవ్ అని హెచ్చరిస్తోంది తెలంగాణ సర్కార్. బోగత జలపాలాల వద్ద మద్యం సేవిస్తే జరిమానా తప్పదు. ఈ మేరకు అటవీ శాఖ కఠిన నిబంధనలకు శ్రీకారం చుట్టింది. బోగత వాటర్ ఫాల్స్ పరిసరాల్లో మద్యం నిషేధం విధిస్తూ.. అతిక్రమిస్తే 2 వేల జరిమానా తప్పదని హెచ్చరిస్తోంది.
ఈ రోజు నుండే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహనాల్లో మందుబాటిల్స్ తీసుకెళ్లినా వాహనాలను సైతం అధికారులు సీజ్ చేస్తారు. అటవీశాఖ వాజేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో బోగత జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ జలపాతాల వద్ద ఎంజాయ్ చేద్దామనుకుని, మద్యం సేవించి, అక్కడకు వెళ్లి స్నానం చేస్తున్న సమయంలో అనేక మంది యువకులు ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రత కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసారు. సో పర్యావరణ ప్రేమికులు బీ కేర్ ఫుల్ అన్నమాట.