ఫ్రీ పెట్రోల్ కావాలా? అయితే ఇంట్లో చెత్తను తీసుకెళ్లి ఈ పెట్రోల్ బంకుల్లో ఇవ్వండి. వాళ్ళే ఉచితంగా పెట్రోల్ పోస్తారు.
మీ ఇంట్లో చెత్త ఉంటే పడేయకండి. పెట్రోల్ బంకుకి తీసుకెళ్తే ఉచితంగా పెట్రోల్ పోస్తారు. చెత్త బరువును బట్టి పెట్రోల్ పోయడం జరుగుతుంది. ఎంత చెత్త ఉన్నా తీసుకుంటారు. అసలే పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మీకు ఈ కాన్సెప్ట్ బాగా వర్కవుట్ అవుతుంది. పెట్రోల్ రేటు తగ్గితేనే కోట్లు కలిసొచ్చినట్టు ఫీలయ్యే సమాజం ఆఫ్ ఇండియాలో ఉన్నాం మనం. అలాంటిది చెత్త తీసుకుని పెట్రోల్ పోస్తుంటే ఈ జనం ఆఫ్ ఇండియా ఎందుకు ఆగుతారు. రయ్ రయ్ మంటూ బంకులోకి పోయి చెత్త ఇచ్చి మరీ పెట్రోల్ పోయించుకుంటారు. మరి చెత్త తీసుకుని పెట్రోల్ పోసే బంకు ఏంటి? ఎంత చెట్లకి ఎంత పెట్రోల్ పోస్తారు? ఎటువంటి చెత్తను తీసుకుంటారు? అనే వివరాలు మీ కోసం.
హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో చెత్తకు బదులు ఉచితంగా పెట్రోల్ పోస్తున్నారు. రీఫ్యూయల్ విత్ రీసైకల్ పేరుతో ఇండియన్ ఆయిల్ బంకు వారు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. చెత్త బరువును చూసి దానికి తగ్గట్టు పెట్రోల్ పోస్తారు. ఉదాహరణకు 2.8 కిలోల చెత్త ఉంటే 380 ఎంఎల్ పెట్రోల్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా రిజిస్టర్ అయిన వారికి అయితే అదనంగా 100 ఎంఎల్ ఉచితంగా ఇస్తున్నారు. దీని కోసం మీరు ఇంట్లో చెత్తను తీసుకెళ్లి బంకులో ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ చెత్త బరువు తూచి వారి యాప్ లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత మీ వాట్సాప్ నంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. రీడీమ్ పాయింట్స్ ద్వారా ఉచితంగా పెట్రోల్ పోయించుకోవచ్చు.
ఒక 5 కిలోల చెత్త పట్టుకెళ్లి ఇస్తే ఒక అర లీటరు పెట్రోల్ వస్తుంది. పది కిలోల చెత్త పట్టుకెళ్తే లీటర్ పెట్రోల్ ఉచితంగా వస్తుంది. పర్యావరణాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ ఈ కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టారు. ఒక టన్ను చెత్తతో 48 ఉద్యోగాలు వస్తాయని.. 7 చెట్లను కాపాడిన వారమవుతామని.. 565 చదరపు మీటర్ల భూమిని చెత్తతో ఫిల్ అవ్వకుండా చేయగలమని.. 137.5 కిలోవాట్ల విద్యుత్ ని పొదుపు చేసినవారమవుతామని బంకు సిబ్బంది తెలిపారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సహా పలు ఏరియాల్లో ఇండియన్ ఆయిల్ ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులు ఇలా పెట్రోల్ పోస్తున్నారు.
హైటెక్ సిటీలోని లెమన్ ట్రీకి ఆపోజిట్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ బంకులో, ఐకియా స్టోర్ కు ఆపోజిట్ లో ఉన్న బంకులో, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 లో, మియాపూర్ దగ్గర సైబర్ ఫిల్లింగ్ స్టేషన్, బేగం పేట్ రోడ్ లో ప్రకాష్ నగర్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ బంకులో వ్యర్థాలకు బదులు పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నారు. అయితే చెత్తలో కొన్ని రకాలనే వీరు తీసుకుంటారు. ప్లాస్టిక్ వేస్ట్, పేపర్, కార్డు బోర్డు, నోట్ బుక్స్, పాడైపోయిన మొబైల్స్, ల్యాప్ టాప్స్, కేబుల్స్, నెట్వర్క్ ఎక్విప్ మెంట్ వంటి వాటిని మాత్రమే చెత్తగా పరిగణిస్తారు. పరుపులు, బ్యాటరీలు, పెద్ద సైజ్ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంట్లో వాడే ప్రమాదకర వ్యర్థాలు, బట్టలు వంటి వాటిని తీసుకోరు. మీరు కనుక ఉచితంగా పెట్రోల్ పొందాలనుకుంటే ఇంట్లో పడున్న ప్లాస్టిక్ వ్యర్థాలను, నోట్ బుక్స్ ని.. పనిచేయని మొబైల్స్, ల్యాప్ టాప్స్ వంటివి తీసుకెళ్లండి. పెట్రోల్ ఫ్రీగా పొందండి.