పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ ఇవాళ బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన అరెస్ట్ విషయంలో కొన్ని పాయింట్లను లేవనెత్తారు.
పదోతరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ షరతులతో కూడిన బెయిల్ మీద ఇవాళ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బండి సంజయ్ విడుదల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. అయితే జైలు నుంచి విడుదలైన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పదోతరగతి పేపర్ లీక్ చేశానని చెప్పి అంటున్నారు, హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. హిందీ పేపర్ లీక్ చేశానని అంటున్నారు కదా.. మరి తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారని ప్రశ్నించారు. తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పరీక్ష హాలులోకి మొబైల్ ఫోన్ ఎలా పోయిందని ప్రశ్నించారు.
వరంగల్ సీపీ రంగనాథ్ పై సైతం ఘాటు విమర్శలు చేశారు. సీపీ రంగనాథ్ చెప్పినవన్నీ నిజాలైతే పోలీసు టోపీ మీద ఉన్న మూడు సింహాలపై ప్రమాణం చేయాలని అన్నారు. పోలీసు వ్యవస్థను అవమానపరిచారని మండిపడ్డారు. మాల్ ప్రాక్టీస్ కి, పేపర్ లీక్ కి తేడా ఏంటో సీపీకి తెలియదా అని ప్రశ్నించారు. పోలీసులు పైసల కోసం, పోస్టుల కోసమే పని చేస్తున్నారని, ఎవరో ప్రశ్నాపత్రం పంపిస్తే తనకేంటి సంబంధం అని అన్నారు. నోటీసులు ఇవ్వకుండా తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారని.. ఎంపీ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదని అన్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కొన్ని డిమాండ్లను మీడియా ముందు వెల్లడించారు.
టీఎస్పీఎస్సీ లీకేజ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, అలానే నష్టపోయిన టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున భృతిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మూడు డిమాండ్లు పక్కా చేసి తీరాలని.. ఇష్యూని డైవర్షన్ చేస్తే ప్రజలు ఊరుకోరని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన వల్ల 30 లక్షల మంది యువకుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని.. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన టీఎస్పీఎస్సీ అభ్యర్థులతో వరంగల్ లో భారీ ర్యాలీ చేపడతామని అన్నారు. మరి జైలు నుంచి వచ్చిన అనంతరం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.