ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్లనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాటి వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అంటే ముందు ఏం చేస్తారు? మీకు నచ్చిన మోడల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుని నేరుగా షోరూమ్ కి వెళ్తారు. అయితే ఇక నుంచి షోరూమ్ కి వెళ్లకుండా ఈ-కామర్స్ సైట్ లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు.
సాధారణంగా మీరు ఒక బైక్, స్కూటీ కొనాలి అంటే షోరూమ్ కి వెళ్లాలి. అక్కడ మీకు నచ్చిన మోడల్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందుకు సంబందించిన ఆఫర్లు తెలుసుకోవాలి. డౌన్ పేమెంట్, పేపర్ వర్క్ ఇలా చాలానే పని ఉంటుంది. దీని వల్ల మీరు పదే పదే షోరూమ్ కి వెళ్లి రావాల్సి వస్తుంది. దీని వల్ల మీ సమయం, డబ్బు వృథా కూడా కావచ్చు. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఇంట్లో కూర్చునే విడా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీని బుక్ చేసుకోవచ్చు. అవును మీరు ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ఈ విడా కంపెనీకి చెందిన ఈవీని బుక్ చేసుకోవచ్చు. మీరు కోరుకుంటే వాళ్లే ఇంటికి డెలివరీ కూడా చేస్తారు.
మీరు విడా కంపెనీ పేరు వినగానే కొత్తగా అనిపించవచ్చు. కానీ, ఇది హీరో మోటో కార్ప్ కంపెనీకి చెందింది. ఈ విడా కంపెనీ నుంచి విడా వీ1 ప్రో, విడా వీ1 ప్రో ప్లస్ అని మొత్తం 2 మోడల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ విడా కంపెనీకి చెందిన ఈ మోడల్స్ లుక్స్ పరంగా ఎంతో స్టైలిష్ గా ఉన్నాయి. దీనిని సింగిల్ సీట్ గా చేసుకోవచ్చు. అలాగే రేర్ సీట్ ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. దీనిలో మంచి డిస్ ప్లే ఉంది. క్రూయిస్ కంట్రోల్ ఫీచర్స్, ఎకో- రైడ్- స్పోర్ట్ అంటూ మూడు మోడల్స్ ఉన్నాయి. ఇది రిమూవబుల్ బ్యాటరీస్ తో వస్తోంది. 5.30 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 95 కిలోమీటర్ల రేంజ్ తో వస్తోంది. ఇందులో మోడల్ మారితే ధర, స్పెసిఫికేషన్స్ మారతాయి.
విడా వీ1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర రూ.1.59 లక్షలుగా ఉంది. విడా వీ1 ప్లస్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.49 లక్షలుగా ఉంది. ఈ వాహనాలపై 5 సంవత్సరాల వరకు వారెంటీ లభిస్తోంది. అయితే అన్ని ఈవీలకు దీనికి ఉన్న వ్యాత్యాసం ఏంటంటే.. దీనిని మీరు ఫ్లిప్ కార్ట్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. విడా కంపెనీ తమ అధికారిక ఈ-కామర్స్ పార్టనర్ గా ఫ్లిప్ కార్టుతో ఒప్పందం చేసుకుంది. మీరు విడా ఈవీని ఫ్లిప్ కార్టులో బుక్ చేసుకుంటే.. 15 రోజుల్లో ఇంటికే డెలివరీ కూడా చేస్తారు. అది కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వస్తుంది. ఫ్లిప్ కార్టులో అయితే విడా వీ1 ప్రో మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. అధికారిక వెబ్ సైట్ లో ఉన్న ధరనే ఆన్ లైన్ లో కూడా అందిస్తున్నారు. ఫేమ్ 2 సబ్సిడీ పోయిన తర్వాత రూ.1.59 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు ఈ స్కూటీని విక్రయిస్తున్నారు. ఈ-కామర్స్ సైట్ లో స్కూటీ బుక్ చేసుకునే సదుపాయం మంచిదేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.