వాట్సాప్ ఎప్పటిలాగానే మళ్లీ కొత్త ఫీచర్స్, అప్ డేట్స్ తో వచ్చేసింది. ఇప్పటివరకు వాట్సాప్ నంబర్ ని 4 డివైజెస్ లో లాగిన్ చేయచ్చు. కానీ, ఇక నుంచి మీరు ఒకే వాట్సాప్ అకౌంట్ ని 4 మొబైల్ ఫోన్స్ లో లాగిన్ చేసుకోవచ్చు. ఫోన్స్, కాల్స్, వీడియో కాల్స్ ఇలా అన్నీ సాధారణంగానే వాడుకోవచ్చు.
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు దాదాపుగా ఈ యాప్ ని వాడుతున్నారు. అందుకే వాట్సాప్ కూడా తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూ ఉంటుంది. ఒక్క ఆండ్రాయిడ్ అనే కాకుండా ఐవోఎస్ కోసం కూడా సరికొత్త ఫీచర్స్ తో ముందుకొస్తుంటుంది. ఇప్పుడు తాజాగా వాట్సాప్ లాగిన్ కి సంబంధించి కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. మీ వాట్సాప్ నంబర్ ని ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి ఏకంగా 4 ఫోన్లలో లాగిన్ చేయచ్చు. ఈ ఫీచర్ గురించి తెలియగానే వినియోగదారులు షాకవుతున్నారు.
వాట్సాప్ తీసుకొచ్చే ఫీచర్స్ అన్నీ వినియోగదారులను షాక్ కి గురి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తీసుకురాబోతున్న ఫీచర్ కూడా అలాంటిదే. ఇప్పటికే మీ వాట్సాప్ ని 4 డెస్క్ టాప్ లలో లాగిన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దానికి అదనంగా ఇప్పుడు ఒకేసారి మీ వాట్సాప్ నంబర్ 4 ఫోన్లలో లాగిన్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. అన్ని ఫోన్లలో కూడా మీరు ఒకే నంబర్ తో వాట్సాప్ ని వినియోగించవచ్చు. మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అన్నీ చేయచ్చు. మీకు ప్రతి చాట్ కూడా ఎండ్ టూ ఎండ ఎన్ క్రిప్షన్ ఉంటుంది. దీని ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని, మీ చాటింగ్ వివరాలను ఎవరూ చోరీ చేసే ఆస్కారం ఉండదు. ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ తో మీ చాట్ ని వాట్సాప్ కూడా చూడలేదు.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ ని ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రస్తుతానికి టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే 4 మొబైల్స్ లో వాట్సాప్ ని లాగిన్ చేసేందుకు వీలు కల్పించనున్నట్లు చెబుతున్నారు. మీకు ప్రధానమైన డివైజ్ అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత మీరు వేరే మొబైల్స్ లో లాగిన్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మీ మెయిన్ మొబైల్ డీ యాక్టివ్ అవుతుందో అప్పుడు కంపానియన్ ఫోన్లలో వాట్సాప్ కూడా లాగౌట్ అయిపోతుంది. ఎక్కువ సమయం మీరు మీ మెయిన్ మొబైల్ ని వాడకపోతే ఆటోమేటిక్ గా కంపానియన్ ఫోన్లలో వాట్సాప్ లాగౌట్ అయిపోతుంది. తిరిగి మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఒకేసారి 4 ఫోన్లలో ఒకే నంబర్ లాగిన్ చేయడం వల్ల లాభం ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.