వాషింగ్ మెషీన్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది.. బట్టలు ఉతకడమే. అవునూ.. వాషింగ్ మెషీన్ వల్లన గృహిణీలకు ఎంతో పని భారం తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో వాషింగ్ మెషీన్ వాడకం బాగా పెరిగింది. బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్ గురించి అందరికి తెలుసు. అయితే బట్టలే కాదు మనుషులను ఉతికే మెషీన్ కూడా ఒకటి రానుంది. ఈ యంత్రాన్ని జపాన్ కి చెందిన ఓ కంపెనీ తయారు చేయనుంది. బట్టలను శుభ్రం చేసినట్లు మనుషులను కూడా వాష్ చేయనుంది ఈ కొత్త యంత్రం.
ఒసాకు చెందిన సైన్స్ కో లిమిటెడ్.. మనుషులకు స్నానం చేయించే యంత్రాన్ని రూపొందిస్తోంది. ‘ఫైన్ బబుల్’ అనే సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ సెన్సార్లు, కృత్రిమ మేధ ఆధారంగా ఈ పరికరం మనుషుల శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అంతేకాక విశ్రాంతిని ఇచ్చే సంగీతాన్ని కూడా వినిపిస్తుంది. వాటర్ రెసిస్టెంట్ డిస్ ప్లే లో ఫోటోలను కూడా చూపిస్తూ అహ్లాదాన్ని అందించేలా చేస్తుంది. అయితే ఈ వాషింగ్ మెషీన్ లో మనిషి వెళ్లి కూర్చుంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది కదా? అనే సందేహం రావచ్చు.. అలాంటి భయం అవసరంలేదంటున్నారు సదరు కంపెనీ అధికారులు. ఎందుకంటే.. ఈ మెషీన్ లోని సెన్సార్లు శరీరంలోని నరాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి. అందుకు తగ్గట్లే దానంతట అదే పనిని మార్చుకుంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సేకరించిన ఈ డేటా సాయంతో అందులో ఉన్నవారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఈ మెషీన్ సృష్టిస్తుందని రూపకర్తలు అంటున్నారు. అయితే మనుషులను వాషింగ్ చేసే మెషీన్ రూపొందించే ఆలోచన అనేది కొత్తదేమి కాదు. 1970లోనే జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సాన్యో ఎలక్ట్రిక్ కంపెనీ ‘అల్ట్రాసోనిక్ బాత్’ అనే పరికరాన్ని తయారు చేసింది. అది కేవలం 15 నిమిషాల్లోనే శరీరాన్ని శుభ్రం చేయడంతో పాటు ఆరబెట్టడం, మసాజ్ చేయడం కూడా పూర్తి చేసింది. అయితే అప్పట్లో దానిపై వచ్చిన సందేహాలతో మార్కెట్లో కి విడుదల చేయలేదు. సాన్యో అనే వ్యాపార వేత్త.. మనుషుల వాషింగ్ మెషీన్ ను రూపొందించాలని చాలా ఏళ్ల క్రితమే భావించాడు. ఈ వెరైటీ మెషీన్ 2025లో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. కొనాలుకునే వారు అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు.