సాధారణంగా స్మార్ట్ ఫోన్ పై ఏదైన వస్తువు బలంగా తగిలితే అది పనిచేయదు. అదే స్మార్ట్ ఫోన్ కి బుల్లెట్ తగిలితే తునాతునకలు అవుతుంది. కానీ మార్కెట్లోకి కొత్తగా రిలీజైన ఓ కొత్త మోడల్ ఫోన్లు మాత్రం బుల్లెట్ తీవ్రతను తట్టుకుని చక్కగా పని చేస్తాయి. వీటిని ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ కంపెనీ “కేవియర్” స్టీల్త్ ఐఫోన్ పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. గతేడాది ఐఫోన్ 12లో లగ్జరీ మోడల్‌ను తీసుకొచ్చిన కేవియర్.. ఇప్పుడు దానికి అప్‌గ్రేడ్ వెర్షన్ గా స్టీల్త్ 2.0 ఐఫోన్ 13 సిరీస్ ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. బుల్లెట్లను సైతం తట్టుకోగలుగుతుంది.
సాధారణ ఫోన్లకు గనుక బుల్లెట్ తగిలితే.. అది ప్యానెల్ గుండా ఫోన్ బాడీలోకి చీల్చుకుపోతుంది. ఫోన్ పనికి రాకుండా దెబ్బతింటుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం బుల్లెట్ తీవ్రతను తట్టుకుని ఉంటుంది. బుల్లెట్ తగిలినా ఆ ఫోన్ కండిషన్ గా పని చేయడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఇప్పటికే కొన్ని బుల్లెట్ ప్రూఫ్ ఫోన్లుగా మార్కెట్లో చెలామణి అవుతున్నాయి.. వాటన్నింటికంటే ఇది స్టాండర్డ్ గా తేలడం విశేషం.
వీటిని బీఆర్-2 క్లాస్2కి చెందిన బుల్లెట్ ప్రూఫ్ కవచంతో తయారు చేయించింది. బుల్లెట్ ప్రూఫ్ కవచాలతో ఆయుధాలను రూపొందించే ఎన్ పీవో టీసీఐటీ సహకారంతో వీటిని కేవీయర్ కంపెనీ రూపొందించింది. ఈ కంపెనీ పిస్టోల్స్ తో ఈ వెర్షన్ ఫోన్ ను కాల్చి మరీ డెమోలను చూపించింది. అదే టైంలో ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దంటూ ప్రజలకు సూచించింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ ఐఫోన్ ప్రారంభ ధర 6,370 డాలర్లు కాగా గరిష్ఠ ధర 7,980 డాలర్లు. ఈ ఫోన్ ధరలను చూస్తే.. ఇవి ధనవంతుల కోసం, సెక్యూరిటీ భయం ఉన్నవాళ్ల కోసం తీసుకురానున్నట్లు తెలుస్తోంది.