డీటీహెచ్ లేదా కేబుల్ టీవీ పేరు ఏదైనా దాదాపుగా ప్రతి ఇంట్లో వీటి సేవలను వాడుకుంటూనే ఉంటారు. కరోనా సమయంలో ఈ డీటీహెచ్ సర్వీసెస్ కు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ గట్టి పోటీ ఇచ్చాయి. ఓటీటీల వల్ల డీటీహెచ్ ప్రొవైడర్లు ఎంతో మంది కస్టమర్లను కోల్పోయారు. అందుకే తర్వాత మీ డీటీహెచ్ సర్వీస్ తీసుకుంటే మీకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఫ్రీ అంటూ ప్రచారాలు చేశారు. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ని కూడా జతచేసి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు డీటీహెచ్ ప్రొవైడర్లకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఫిబ్రవరి 1 నుంచి న్యూ టారిఫ్ ఆర్డర్ 3.0 అమలులోకి వచ్చింది. దీని వల్ల డీటీహెచ్ నెలవారీ చందాలు మరింత పెరగనున్నాయి.
కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా ఎంత పెరిగిందో అందరికీ తెలిసిందే. ఇంట్లో వాళ్లు చూసే సీరియల్స్ ని ఒకరోజు ముందే ఓటీటీల్లో చూసేస్తున్నారు. దాని వల్ల డీటీహెచ్ సేవలు అందించే వారికి తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా మంది డీటీహెచ్ వదిలేసి ఓటీటీ సేవలను తీసుకున్నారు. తర్వాత చిన్నగా ఓటీటీ సేవలను అందిస్తూ డీటీహెచ్ ప్రొవైడర్లు కస్టమర్లను ఆకట్టుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు మళ్లీ న్యూ టారిఫ్ పాలసీతో వారికి నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు దీనివల్ల డీటీహెచ్ నెలవారీ చందాకూడా పెరగనుంది. అందుకే చాలా మంది డీటీహెచ్ ప్రొవైడర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
న్యూ టారిఫ్ ఆర్డర్ 3.0 ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. దీనిని మొదటి నుంచి డీటీహెచ్ ప్రొవైడర్లు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆలిండియా కేబుల్ ఫెడరేషన్ మెంబర్ ఒకరు గతంలో కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆర్డర్ పై స్టే ఇవ్వాలంటూ కోరారు. కానీ, కేరళ హైకోర్టు జనవరి 6న ఈ పిటీషన్ ను తోసిపుచ్చింది. తర్వాత ఫిబ్రవరి 1 నుంచి ఆ ఆర్డర్ అమలులోకి వచ్చింది. ఇప్పటికే 80 శాతం మంది ఈ కొత్త టారిఫ్ రెజైమ్ ని అంగీకరిస్తూ సంతకం కూడా పెట్టారంట. అయితే ఒక్కసారిగా కాకుండా 4 నుంచి 6 వారాల వ్యవధిలో ఈ డీటీహెచ్ టారిఫ్ లు పెరగనున్నాయి. దాదాపుగా నెలకు రూ.25 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.