ఒకప్పుడు ఫోన్‌లో మాట్లాడాలంటే ఎంతో ఆలోచించేవారు. ఎక్కువ సేపు మాట్లాడితే రీఛార్జ్ చేసుకున్న అమౌంట్ మొత్తం అయిపోతుందని భయపడిపోయేవారు. మాటలు పొదుపుగా వాడేవారు. కానీ, జియో విప్లవం కారణంగా టెలికాం రంగంలో పెనుమార్పులు వచ్చాయి. ఇంటర్‌నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్‌నెట్, టాక్‌టైం ధరలు ఒక్కసారిగా పాతాలానికి చేరుకున్నాయి. నెల రీఛార్జ్, అన్‌లిమిటెడ్ రీఛార్జ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇక, అప్పటివరకు టాప్‌లో ఉన్న చాలా కంపెనీలు నేలపై పడిపోయాయి. అలాంటి వాటిలో ఎయిర్ టెల్ ఒకటి. జియో రాకకు ముందు వరకు ఎయిర్‌టెల్ నెంబర్ 1గా ఉండేది. తర్వాత దాని పరిస్థితి మారిపోయింది. అయినప్పటికి ప్రస్తుతం జియోతో పోటీలో కొనసాగుతోంది.
అయితే, ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు దెబ్బ మీద దెబ్బ వేస్తోంది. మినిమమ్ రీఛార్జ్ ప్లాన్‌లను నెలల తేడాతోనే పెంచేస్తోంది. కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను ఆకాశంలోకి పంపేస్తోంది. కొన్ని నెలల ముందు వరకు కనీస రీఛార్జ్ ధర 79 రూపాయలు ఉండేది. అది కాస్తా 20 రూపాయలు పెరిగింది. ఏకంగా 99 రూపాయలు అయింది. ఇప్పుడు ఉన్న ఈ ధరలో కూడా ఎయిర్ మార్పులు తెచ్చింది. 99 స్థానంలో 28 రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర 155 రూపాయలు. 155 రూపాయల రీఛార్జ్‌తో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌గా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.
దీంతో పాటు ఒక జీబీ ఇంటర్‌నెట్ డేటాతో పాటు 300 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. ప్రస్తుతం ఈ పెరుగుదల హర్యానా, ఒడిస్సాలలో అమల్లోకి వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లోని ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఇదే అందుబాటులో ఉన్న కనీస రీఛార్జ్ ధర. ఆ రాష్ట్రాల కస్టమర్లు రీఛార్జ్ చేయించుకోవాలనుకుంటే కనీసం 155 పెట్టాల్సిందే. 109, 111 రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులో లేకుండాపోయాయి. ఇక, కనీస రీఛార్జ్ ప్లాన్‌లో మార్పు ప్రస్తుతం హర్యానా, ఒడిస్సా రాష్ట్రాల్లోనే అమల్లో ఉన్నా.. మరికొన్ని రోజుల్లో అది ఇండియా వ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని టెలికామ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే గనుక జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని ఎయిర్‌టెల్ కస్టమర్లకు దెబ్బ మీద దెబ్బ తగలనుంది.