భారత క్రికెట్ కి ఒకానొకదశలో వెన్నుముకల నిలిచిన యువరాజ్ సింగ్ కి బీసీసీఐ కెప్టెన్సీ పదవి ఎందుకు ఇవ్వలేదో ఇప్పటికీ ఒక మిస్టరీగా మారింది. వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా కెప్టెన్సీ చేసే అవకాశం అయితే యువీకి దక్కలేదు. ఈ విషయంపై స్పందిస్తూ తాజాగా యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్‌సింగ్ ప్రస్థానం మరువలేనిది. దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అందులో ఒకటి 2007 టీ20 వరల్డ్ కప్ కాగా, మరొకటి 2011 వన్డే వరల్డ్ కప్. అలాంటి ఆటగాడు వైస్ కెప్టెన్ గా కొన్నాళ్ళు పనిచేసినా.. కెప్టెన్సీ చేపట్టకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశమే. అయితే, తాను 2007లోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదని తాజాగా వెల్లడించాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
“2005 నుంచి 2007 మధ్య కాలంలో గ్రెగ్ చాపెల్ టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. అదే సమయంలో నేను కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చింది. అంతలోనే గ్రేగ్ ఛాపెల్ వివాదం చోటుచేసుకుంది. కోచ్ గా అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలను సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తప్పుబట్టారు. అప్పుడు సచిన్, గంగూలీ వైపే నేను మొగ్గు చూపా. అది కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. దీంతో నన్ను తప్ప ఎవరినైనా కెప్టెన్ చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు నాకు తెలిసింది. అయితే.. అదెంతవరకు నిజమో నాకు తెలియదు. అప్పటికి వైస్ కెప్టెన్‌గా ఉన్న నన్ను ఉన్నట్టుండి తొలగించారు” అని తెలిపాడు.
ఇది కూడా చదవండి: Chris Gayle: ఐపీఎల్ పై యూనివర్సల్ బాస్ ‘క్రిస్ గేల్’ షాకింగ్ కామెంట్స్!
“ముఖ్యంగా 2007 వరల్డ్‌కప్‌కు ముందు బ్యాటింగ్ ఆర్డ్‌ర్‌ను మార్చేయడం జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ అయిన సచిన్‌ను మిడిలార్డర్‌లో ఆడించడం.. గంగూలీతో చాపెల్‌కు పొసగకపోవడం.. దాదా రిటైర్ అవ్వడం.. 2007 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం వెనుక చాపెల్ పాత్ర చాలా ఉందని సచిన్: బిలియన్ డ్రీమ్స పుస్తకంలో రాసి ఉంటుంది. ఇదే చాపెల్ ఉదంతం నన్ను కెప్టెన్సీకి దూరం చేసింది” అని పేర్కొన్నాడు.
“వాస్తవానికి 2007 ప్రపంచకప్ టోర్నీకి ముందు మేం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాం. అప్పుడు సెహ్వాగ్ జట్టులో లేడు. నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నా. ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో నేనే కెప్టెన్ అవ్వాల్సింది. కానీ, అనూహ్యంగా నన్ను కాదని ధోనీని ఎంపిక చేశారు. అది నాకు పూర్తిగా వ్యతిరేకమైన నిర్ణయం. అయినా, ఆ విషయంలో నేనెప్పుడూ బాధపడలేదు. అయితే, కొద్ది రోజుల తర్వాత ధోనీ కెప్టెన్సీ బాగా చేస్తున్నాడని అర్థం చేసుకున్నా. ఒకవేళ నన్ను కెప్టెన్‌గా చేసినా ఎక్కువ కాలం కొనసాగనని అనుకున్నా. ఏదైనా మన మంచికే జరుగుతుంది” అని యువరాజ్ చెప్పుకొచ్చాడు.
ఇక యువరాజ్ తన 17 ఏళ్ల కెరీర్‌లో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8,701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు సాధించాడు. వన్డేల్లో 14 సెంచరీలు అందుకున్న యువరాజ్ టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించాడు.