ఉత్కంఠకు మారుపేరుగా నిలిచే క్రికెట్ ఎంతటి కిక్ ఇస్తుందో మరోసారి రుజువైంది. ఉమెన్స్ వరల్డ్‌కప్ ఫస్ట్ మ్యాచే అభిమానులకు సూపర్ థ్రిల్ ఇచ్చింది. చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి 6 పరుగులు కావాల్సి ఉండగా విండీస్ మహిళా బౌలర్ డియాండ్రా డాటిన్ మ్యాజిక్ చేసింది. 2 వికెట్లతో పాటు ఓ రనౌట్‌తో మూడు వికెట్లు పడగొట్టింది. ఆ ఓవర్‌లో కేవలం 2 పరుగులే ఇచ్చి జట్టుకు ఊహించని గెలుపును అందించింది. దీంతో విజయం ఖాయమనుకున్న ప్రపంచకప్‌నకు అతిథ్యం ఇస్తున్న న్యూజిలాండ్ టీమ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ 128 బంతుల్లో 119 పరుగులు సాధించింది. మిగతా బ్యాటర్లలో చెడియన్ నేషన్ 36, కెప్టెన్ టేలర్ 30, వికెట్ కీపర్ కాంప్బెల్లే 20, డియాండ్రా డాటిన్ 12 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో తాహుహు 3, జెస్ కెర్ 2, హన్నా రోవ్, అమేలియా కెర్ తలో వికెట్ తీశారు. అనంతరం 260 పరుగుల లక్ష్యంతో న్యూజిలాండ్ మహిళలు బరిలోకి దిగగా ఆ జట్టు కెప్టెన్ సోఫీ డివైన్ సెంచరీతో చెలరేగింది. మొత్తంగా 127 బంతులు ఎదుర్కొన్న సోఫీ డివైన్ 10 ఫోర్ల సాయంతో 108 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కేటీ మార్టిన్ (44), అమీ సాటర్త్‌వైట్ (31), జెస్ కెర్ (25) కూడా మంచి స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ విజయం ఖాయంగా కనిపించింది. 49 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోర్ 254-7గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే మరో 6 పరుగులు కావాలి. క్రీజులో కేటీ మార్టిన్ (44), జెస్ కెర్ (25) ఉన్నారు.
ఈ సమయంలో చివరి ఓవర్‌ను డియాండ్రా డాటిన్ వేసింది. ఈ మ్యాచ్‌లో ఆమె వేసిన ఏకైక ఓవర్ ఇదే కావడం గమనార్హం. ఈ ఓవర్‌లో తొలి బంతికి ఒక పరుగు ఇచ్చిన డాటిన్ రెండో బంతికి 44 పరుగులు చేసిన కేటీ మార్టిన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసింది. మూడో బంతికి ఒక్క పరుగు రాగా నాల్గో బంతికి 25 పరుగులు చేసిన జెస్ కెర్‌ను ఔట్ చేసింది. ఆమె హెన్రీకి క్యాచ్ ఇచ్చి ఔటయింది. ఐదో బంతికి ఫ్రాన్ జోనాస్‌ను డాటిన్ రనౌట్ చేసింది. దీంతో మరో బంతి మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఆలౌటైంది. 3 పరుగుల తేడాతో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. ఇలా నరాలు తెగ ఉత్కంఠ మధ్య జరిగిన చివరి ఓవర్‌లో వెస్టిండీస్ అంతిమ విజేతగా నిలిచింది. మరి ఈ థ్రిల్లింగ్ ఓవర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A thrilling win for West Indies in the #CWC22 opener against New Zealand 💥
➡️ https://t.co/D8FZLUoY6p pic.twitter.com/xOW06d3M0F
— ICC Cricket World Cup (@cricketworldcup) March 4, 2022