అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రభ కోల్పోయి.. చిన్న జట్ల చేతిలోనూ పరాజయాలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ జట్టు భారత్‌పై రెండో వన్డేలో విజయం సాధించగా.. సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి.
ప్రధాన ఆటగాళ్లంతా దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే.. ఫ్రాంచైజీ లీగ్‌లపైనే ఎక్కువ దృష్టి పెడుతుండటంలో వెస్టిండీస్ జట్టు నానాటికి తీసికట్టులా మారుతోంది. విధ్వంసక ఆటగాళ్లకు పెట్టింది పేరైన కరీబియన్లను.. ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చేలా చర్యలు తీసుకోవడంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విఫలమవుతోంది. దీంతో ఇటీవలి కాలంలో విండీస్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. 2016 టీ20 ప్రపంచకప్ గెలుపొందిన తర్వాత ఆ జట్టు ఆటతీరు రోజు రోజుకూ దిగజారుతూ వస్తోంది. ఒకప్పుడు వెస్టిండీస్‌తో ఆడాలంటే వణికిపోయే జట్లు సైతం.. ఇప్పుడు కరీబియన్లను లైట్ తీసుకుంటున్నారు.
ఇటీవల జింబాబ్వే వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలోనూ.. కరీబియన్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. స్కాట్లాండ్, నెదర్లాండ్, జింబాబ్వే చేతిలో ఓడి.. 46 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి మెగాటోర్నీకి అర్హత సాధించలేకపోయారు. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో విండీస్ ప్లేయర్లు బరిలోకి దిగడం లేదు. మరి అలాంటి నాసిరకం ప్రదర్శన చేస్తున్న కరీబియన్లు.. భారత్‌పై వన్డేలో విజయం సాధిస్తారని.. ఆ దేశ అభిమానులు కూడా ఊహించి ఉండరు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో.. కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ అంశాన్ని వెస్టిండీస్ క్రికెట్.. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దానికి ఓ అభిమాని వింతైన రిప్లే ఇచ్చాడు.
భారత జట్టుపై విండీస్ ఓ వన్డే మ్యాచ్ నెగ్గడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడంతో.. ఓ అభిమాని ‘విండీస్ గెలిస్తే.. ఉచితంగా రమ్’ అనే బోర్డును పోస్ట్ చేశాడు. చాన్నాళ్లుగా టీమిండియాపై గెలువని కరీబియన్లు.. ఇప్పుడు మంచి ప్రదర్శన చేయడంతో అభిమానులు ఖుషీలో మునిగిపోగా.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా దీనిపై అంతే ఫన్నీగా స్పందించింది. ‘రమ్ తీసుకొని వచ్చేయ్’ అంటూ కామెంట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలోని అన్నీ జట్లను తమ పేస్ బౌలింగ్‌తో గడగడలాడించిన వెస్టిండీస్.. ఇప్పుడు ఒక్క వన్డే మ్యాచ్‌లో నెగ్గినందుకే సంబురాలు చేసుకుంటోందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి విండీస్ అభిమని పోస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Rules are rules pic.twitter.com/3pTNL4gGQX
— Rehani (@RehaniWrites) July 29, 2023