టీ20 వరల్డ్ కప్ 2022.. టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్. భారత్ ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలిచితీరాలి. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేసి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. ఇంకేముంది టీమిండియా గెలుపు ఖాయం అని అనుకున్నారు అభిమానులు. కానీ బంగ్లా బ్యాటింగ్ కు దిగాక గానీ తెలియలేదు.. ఎడాపెడా బౌండరీలు బాదుతూ భారత బౌలర్లపై యుద్దాన్నే ప్రకటించాడు బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్. కేవలం 21 బంతుల్లోనే అర్దశతకం బాదాడు. వర్షం వచ్చి మ్యాచ్ ఆగే సమయానికి బంగ్లా 7 ఓవర్లలో 66 పరుగులు చేస్తే.. అందులో 59 రన్స్ లిట్టన్ దాస్ చేసినవే కావడం గమనార్హం. ఇంతటి విధ్వంసం సృష్టించిన దాస్ బంగ్లా టీమ్ లో జాతి వివక్షను ఎదుర్కొన్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా? హిందువు అనే ఒకే ఒక్క కారణంతో దాస్ బంగ్లా జట్టులో పలు సందర్భాల్లో వివక్ష ఎదుర్కొన్నాడు. తాజా ఇన్నింగ్స్ తో లిట్టన్ దాస్ కు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
లిట్టన్ దాస్.. భారత్ తో మ్యాచ్ కు ముందు వరకు కేవలం కొంత మందికే తెలిసిన పేరు. కానీ తాజాగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో ఒంటి చేత్తో గేమ్ ను గెలిపించినంత పని చేశాడు. వర్షమే కనుక అడ్డు తగలక పోతే భారత్ ఓటమి చెందేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దాస్ 27 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు అంటేనే అతడి ఊచకోత ఎలాగుందో అర్దం అవుతుంది. ఇంతటి అద్భతమైన ఆటగాడు అయినప్పటికీ ఒకానొక దశలో బంగ్లా జట్టులో జాతి వివక్ష ఎదుర్కొన్నాడు. అందుకు ఒకే ఒక కారణం బంగ్లా జట్టులో ఉన్న ఇద్దరు హిందూ క్రికెటర్లలో దాస్ ఒకడు కావడం. మరో ఆటగాడు సౌమ్యా సర్కారు. ఈ కారణంగానే కొన్ని టోర్నీల్లో సైతం దాస్ ను పక్కన పెట్టారు అని లిట్టన్ దాస్ సన్నిహితులు పేర్కొన్నారు. లిట్టన్ దాస్ బంగ్లాదేశ్ లోని దినాజ్ పూర్ ప్రాంతానికి చెందిన బెంగాలీ హిందూ కుటుంబంలో పుట్టాడు.
ప్రస్తుతం బంగ్లా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న దాస్.. టీమిండియాపైనే తన టెస్ట్, వన్డే అరంగ్రేటరం చేయడం విశేషం. భారత జట్టుపై లిట్టన్ దాస్ కు మెరుగైన రికార్డులు ఉన్నాయి. 2018 ఆసియా కప్ ఫైనల్లో భాగంగా.. టీమిండియాపై సెంచరీ బాదాడు. 117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్ లతో 121 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఆఖరి బాల్ కు బంగ్లా ఓడిపోయినప్పటికీ దాస్ పోరాటానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఓ క్యాలెండర్ ఇయర్ లో 1693 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన బంగ్లా క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. ఇంతటి మంచి ట్రాక్ రికార్డులు ఉన్న క్రికెటర్ సైతం అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందుకు ఎదుర్కొవడం సహజమే అంటున్నారు క్రీడాభిమానులు. ఇక దాస్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. తన గ్లర్ ఫ్రెండ్ అయిన దేవశ్రీ బిస్వాస్ సోంచితను 2019 వివాహం చేసుకున్నాడు. లిట్టన్ దాస్ శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు అన్న విషయం అతడి సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. జట్టులో చోటు కోల్పొతూ.. ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా కేవలం ఆట మీదే దృష్టి పెట్టాడు. జాతి వివక్షతను దాటుకుని హీరోగా నిలబడ్డాడు.