బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది అనడం కంటే పోరాడి గెలిచింది అనడం కరెక్ట్. భారత్ ముందు బంగ్లాదేశ్ పసికూన జట్టైనా, ఒకానొక సమయంలో చెమటలు పట్టించింది. మ్యాచును ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్ధమయ్యే ఉంటుంది. బంగ్లా ఇన్నింగ్స్ సాగినంత సేపు భారత డగౌట్ లో కూర్చొన్న ఏ ఒక్కరు సంతోషంగా కనపడలేదు. ముఖ్యంగా బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ క్రీజులో ఉన్నంతవరకు ఏ ఒక్కరిలో సంతోషం లేదు. ఆ తరువాత వర్షం అంతరాయం కలిగించడం.. బంగ్లాదేశ్ 17 ఓవర్లలో 151 పరుగుల టార్గెట్ చేధించాల్సిరావడం.. ఓటమి పాలవడం చక చకా జరిగిపోయాయి. ఈ మ్యాచులో కెఎల్ రాహుల్, లిటన్ దాస్ ను రనౌట్ చేసిన సందర్భమే మ్యాచుకు టర్నింగ్ పాయింట్. అయితే.. ఈ రనౌట్ చేయడం వెనుక రవిచంద్రన్ అశ్విన్ మాస్టర్ మైండ్ ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అడిలైడ్ వేదికగా భారత్-బంగ్లా మ్యాచ్. గెలిస్తే సెమీస్ కు దగ్గరవ్వొచ్చు. అందుకు తగ్గట్లే తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, బంగ్లా ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. బంగ్లా గెలవాలంటే 186 చేయాలి. మబ్బులు పట్టిన వాతావరణం. వర్షం ముప్పును ముందే పసిగట్టిన ఆ జట్టు ఓపెనర్ లిటన్ దాస్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. షమీ, భువీ, అర్షదీప్ ఎవరైతే నాకేంటీ అన్నట్లుగా బాదుడే పనిగా పెట్టుకున్నాడు. అతని ధాటికి భారత్ పవర్ ప్లే 6 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకుంది. మరొక ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది బంగ్లా. అంతే.. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. గంటసేపు ఎడతెరపని వర్షం. భారత శిభిరంలో టెన్షన్ మొదలయింది.
Only the third player to hit a fifty in the powerplay at the men’s T20 World Cup 👏
Litton Das almost took Bangladesh over the line against India #INDvBAN | #T20WorldCup pic.twitter.com/ALClDYQoBF
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2022
వర్షం తగ్గకుంటే గెలుపు బంగ్లా పులులదే. ఎందుకంటే డక్ వర్త్ లూయిస్ ప్రకారం అప్పటికి 17 పరుగుల ఆధిక్యంలో ఉంది ఆ జట్టు. అయితే గంట తర్వాత వరుణుడు శాంతించాడు. తిరిగి మొదలైంది ఆట. విరామం తర్వాత 9 ఓవర్లలో 85 పరుగులు అవసరమయ్యాయి లిటన్ ఊపు చూస్తే బంగ్లాదేశ్ దే విజయం అనిపించక మానదు. అప్పుడే జరిగింది మ్యాచును మలుపు తిప్పిన ఘటన. అశ్విన్ వేసిన బంతిని షార్ట్ మిడ్ వికెట్ మీదుగా ఆడిన శాంటో ఒక పరుగు తీసి రెండో పరుగుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ బంతిని అందుకొని నేరుగా గురిచూసి వికెట్లకు కొట్టాడు. అంతే.. మైదానంలోని ఆటగాళ్లతో పాటు స్టేడియంలో కూర్చున్న అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. కారణం ప్రమాదకర లిటన్ దాస్ రనౌట్ రూపంలో వెనుదిరగడమే. మ్యాచ్ లో అదే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన బంగ్లా విజయానికి 5 పరుగుల దూరంలో ఆగిపోయింది.
అయితే.. ఈ రనౌట్ వెనుక రవిచంద్రన్ అశ్విన్ హస్తమున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అశ్విన్ బౌలింగ్ వేస్తున్న సమయంలో నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న దాస్, క్రీజు వదిలితే అశ్విన్ ఎక్కడ మన్కడింగ్ చేస్తాడో అన్న భయంతోనే క్రీజును అంటిపెట్టుకొని ఉండిపోయాడు. అదే తనను రనౌట్ రూపంలో వెనుదిరిగేలా చేసింది. ఒకవేళ ఆ సమయంలో అశ్విన్ కాకుండా మరే ఏ బౌలర్ ఉన్నా ఇది జరిగేది కాదేమో. నాన్ స్ట్రైక్ బ్యాటర్లు క్రీజు వదిలితే మన్కడింగ్ చేస్తా అన్నట్లుగా అశ్విన్ భయపెట్టడమే అందుకు కారణం. 2012 కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో లాహిరు తిరుమన్నేను మన్కడింగ్ చేసిన అశ్విన్, రనౌట్ కోసం అప్పీల్ చేస్తాడు. ఆ తరువాత అంపైర్లు దాన్ని ఔట్ గా ప్రకటించినా.. సెహ్వాగ్ కలగజేసుకుని తమ నిర్ణయాన్ని వెనక్కిటుకుంటాడు. ఆ తరువాత 2019 ఐపీఎల్ టోర్నీలో జాస్ బట్లర్ ను మన్కడింగ్ చేసి.. వార్తల్లో నిలుస్తాడు. ఇలా పలుమార్లు అశ్విన్ నాన్ స్ట్రైక్ బ్యాటర్లను భయపెట్టడమే లిటన్ దాస్ ను కట్టిపడేలా చేసి, రనౌట్ అయ్యేలా చేసింది.