సనత్ జయసూర్య.. శ్రీలంక క్రికెట్‌లో ఈ పేరు ఒక సంచలనం. కొన్నేళ్ల పాటు శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను ముందుండి నడిపించిన దిగ్గజం. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో పోటీ పడి మరీ పరుగుల వరద పారించాడు. ఓపెనర్ అంటే జయసూర్యలా ఉండాలనేలా పవర్ హిట్టింగ్‌తో విరుచుకుపడేవాడు. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి జట్లపై అతనిదే ఆధిపత్యం. తన సూపర్ బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేలకు పైగా రన్స్ బాదిన జయసూర్య.. శ్రీలంక జట్లులోకి తొలుత బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చాడనే సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. ఇలాంటి గొప్ప బ్యాటర్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వస్తే.. అతనిలోని టాలెంట్‌ను ఎవరూ గుర్తించారు? 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే అనామక ఆటగాడు.. శ్రీలంక ఓపెనింగ్ స్థానాన్ని ఎలా ఏలాడో ఇప్పుడు తెలుసుకుందాం..
1989 డిసెంబర్ 26న ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌తో జయసూర్య అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జయసూర్య 5 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఇక 1991 ఫిబ్రవరి 22న న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో సాంప్రదాయ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జయసూర్య 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు జట్టులో మిడిల్, లోయరార్డర్ బ్యాటర్‌గానే కొనసాగాడు. ఇలా ఆడుతున్నంత కాలం జయసూర్య ఒక సాధారణ క్రికెటర్‌గా కనిపించాడు. ఎందుకంటే అతని అతనిస్థానం కాదు.. అతను ఆడాల్సిందే వేరే ప్లేస్‌లో. ఈ విషయం తనకు కూడా తెలిసి ఉండదు. కానీ.. శ్రీలంక దిగ్గజ ఆటగాడు, అప్పటి లంక కెప్టెన్ అర్జున రణతుంగా మాత్రం జయసూర్యలో ఏదో స్పార్క్ ఉందని గుర్తించాడు.
జయసూర్యలోని బెస్ట్‌ను బయటకు తీసేందుకు రణతుంగా.. అతన్ని ఓపెనర్‌గా మార్చాడు. మ్యాచ్‌లో బరిలోకి దింపేందుకు ముందు జయసూర్యను పలు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా ప్రయోగాలు చేశాడు. ఇదంతా 1996 వన్డే వరల్డ్ కప్ ముందు జరిగింది. శ్రీలంకను విశ్వవిజేతగా నిలిపేందుకు కెప్టెన్ రణతుంగా ఒక బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేశాడు. 1996 వరల్డ్ కప్‌లో జయసూర్య ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్‌లో 82 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు కూడా కూల్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అలాగే ఆ వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా జయసూర్యనే గెలుచుకున్నాడు. ఈ వరల్డ్ కప్ నుంచి ప్రపంచ క్రికెట్‌లో జయసూర్య హవా మొదలైంది. ఓపెనర్‌గా తన స్థానం పదిలం చేసుకోవడంతో పాటు.. పలు దేశాల బౌలర్లకు సింహస్వప్నంగా మారిపోయాడు. అతను టచ్ చేస్తే బంతి వెళ్లి బౌండరీ లైన్ బయటపడేది.
ఇక 1997లో భారత్‌పై జయసూర్య ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్‌లోనే ది బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది. భారత్-శ్రీలంక మధ్య జరిగిన టెస్టులో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లంక ముందు 537 పరుగుల భారీ స్కోర్ ఉంచింది. సచిన్ టెండూల్కర్, అజహరుద్దీన్ సెంచరీలతో చెలరేగారు. టెస్టు క్రికెట్‌లో వన్డే తరహా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏకంగా ఆ మ్యాచ్‌లో 340 పరుగుల బాదాడు. అందులో 36 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. అలాగే ఇంగ్లండ్‌పై ఓవెల్‌లో చేసిన 213 పరుగుల ఇన్నింగ్స్ కూడా జయసూర్య కెరీర్‌లో బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచింది. టెస్టులతో పాటు వన్డేల్లోనూ జయసూర్య తన ప్రతాపం చూపించాడు. కోకకోలా ఛాంపియన్స్ ట్రోఫీ 2001 ఫైనలో భారత్‌పై శ్రీలంక 299 పరుగులు చేస్తే.. అందులో జయసూర్య బాదినవే 189 ఉండటం విశేషం. 1996 వరల్డ్ కప్ తర్వాత భారత్, పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్‌లో జయసూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లోనే సెంచరీ బాది ఔరా అనిపించాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే జయసూర్య ఆడిన గొప్ప గొప్ప ఇన్నింగ్సులు చాలానే ఉన్నాయి. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జయసూర్య.. తన కెరీర్‌లో 110 టెస్టులు ఆడి 6973 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో పరుగులు ప్రవాహం పారించిన జయసూర్య మొత్తం 445 మ్యాచ్‌ల్లో 13430 పరుగులు సాధించాడు. అందులో 28 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ జయసూర్యకు మంచి రికార్డులు ఉన్నాయి. టెస్టుల్లో 98, వన్డేల్లో 323 వికెట్లు జయసూర్య ఖాతాలో ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన జయసూర్య ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి జయసూర్య ఇన్నింగ్స్ ఆరంభించడం క్రికెట్ అభిమానులకు ఐ ఫీస్ట్‌ను ఇచ్చింది. ఇలా ఒక బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జయసూర్య.. ప్రపంచంలోనే గొప్ప ఓపెనర్‌గా తన కెరీర్‌ను ముగించాడు.
#OnThisDay in 2000, Sri Lanka pummelled India by a staggering 245 runs in a tri-series final in Sharjah 😮
Sanath Jayasuriya smashed a stunning 189, Chaminda Vaas took 5 for 14 and Muthiah Muralidaran 3 for 6 💪
— ESPNcricinfo (@ESPNcricinfo) October 29, 2022
Sanath Jayasuriya has more runs in ODIs than B. Lara, V. Kohli, J. Kallis, R. Dravid, C. Gayle
And
Sanath Jayasuriya has more wickets in ODIs than S. Warne, Saqlain Mushtaq, J. Kallis, J. Anderson, Kapil Dev, C. Walsh pic.twitter.com/DYkv2Wcwsw
— Jayanta Kumar Nath (@IMJayNath) October 29, 2022