డేవిడ్ వార్నర్.. మైదానంలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటాడు. ట్రెండ్ కు తగ్గ పాటలకు డాన్స్ లు చేస్తూ.. ఎప్పుడూ వార్తలో నిలుస్తుంటాడు. ముఖ్యంగా తెలుగు పాటలకు వార్నర్ వేసే స్టెప్పులకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనడంలో సందేహం లేదు. ఇక వార్నర్ బ్యాటింగ్ చేసే క్రమంలో అప్పుడప్పుడు రకరకాల షాట్లతో క్రీజ్ లో విన్యాసాలు చేస్తుంటాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో జరిగిన ఆఫ్గాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో సైతం వెరైటీ స్వీప్ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం వార్నర్ అవుట్ అయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా-ఆఫ్గానిస్థాన్ ల మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు.. ఆసిస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా 5 ఓవర్లకు 50/1 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. గత కొంత కాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న డేవిడ్ వార్నర్ 17 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులతో మంచి టచ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ ఎప్పటిలాగే తన బ్యాటింగ్ లో ఉన్న రకరకాల షాట్స్ ను బయటపెట్టాలనుకున్నాడు వార్నర్.
ముఖ్యంగా స్విచ్ షాట్ కొట్టడంలో డేవిడ్ సిద్దహస్తుడు అని మనందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కూడా అదే షాట్ ను ట్రై చేసి సిల్లీగా అవుట్ అయ్యాడు వార్నర్. ఆఫ్గాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. 5వ ఓవర్ 2 బాల్ వెయ్యడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు బౌలర్.. అప్పటిదాకా లెఫ్ట్ హ్యాండర్ గానే ఉన్న వార్నర్ ఒక్కసారిగా రైట్ హ్యాండర్ గా మారాడు. భారీ షాట్ కొడదాం అని ట్రై చేద్దాం అనుకున్న వార్నర్ ని బోల్తా కొట్టించాడు ఉల్-హక్. అద్భుతమైన స్లో బాల్ తో మిడిల్ వికెట్ ను నేలకూల్చాడు నవీన్ ఉల్. ఆఫ్గన్ బౌలర్ ను తక్కువ అంచనా వేసిన వార్నర్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అయితే స్విచ్ షాట్స్ ఆడటం వార్నర్ కు కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి షాట్స్ బాగానే ఆడిన రికార్డు డేవిడ్ భాయ్ కు ఉంది.
అది 2012 ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. నూనూగు మీసాల లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ క్రీజ్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే బౌలింగ్ వేయడానికి వచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. క్రీజ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ అశ్విన్ వేసిన బంతిని నేరుగా స్టాండ్స్ లోకి పంపాడు. దాంట్లో విశేషం ఏముంది అంటారా. అతడు కొట్టిన సిక్స్ లెఫ్ట్ హ్యాండర్ గా ఉండి కొట్టింది కాదు. రైట్ హ్యాండర్ బ్యాటర్ గా మారి స్విచ్ హిట్ గా భారీ షాట్ తో బంతిని ప్రేక్షకుల మధ్య కు పంపాడు. దాంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు అశ్విన్. అయితే డేవిడ్ భాయ్ కు ఇలా స్విచ్ షాట్స్ కొట్టడం కొత్తేమీ కాదు. ప్రతీ మ్యాచ్ లో దాదాపు ఒకటో రెండో షాట్స్ ఆడుతూనే ఉంటాడు. అయితే ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో.. పైగా కీలక మ్యాచ్ ల్లో ఇలా ఆడి, అవుటై విమర్శల పాలు కావడం ఎందుకని వార్నర్ అభిమానులు అంటున్నారు. అదృష్టవశాత్తు మ్యాచ్ ఆసిస్ గెలిచింది కాబట్టి సరిపోయింది లేదంటే వార్నర్ ట్రోల్స్ కు గురయ్యేవాడే అని సగటు క్రీడాభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.