క్రికెట్లో బెస్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్న కామనే. భారత క్రికెట్లో ఎవరు అత్యుత్తమ సారథి అంటే వెంటనే ధోని పేరు చెబుతారు. ధోని తర్వాత కోహ్లి, గంగూలీల ప్రస్తావన తీసుకొస్తారు. కానీ వీళ్లెవరూ కాదు.. ఇండియన్ క్రికెట్లో బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ అనే చెప్పాలి.
ఒక్క ఓటమితో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టును ఓటమిని తట్టుకోలేని ఫ్యాన్స్.. హిట్‌మ్యాన్‌ను టార్గెట్‌గా చేసుకొని విమర్శలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో రోహిత్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు. టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ను ఫైనల్లో ఆడించకుండా రోహిత్ తప్పు చేశాడని అంటున్నారు. అతడి కెప్టెన్సీలో దూకుడు కనిపించట్లేదని చెబుతున్నారు. హిట్‌మ్యాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్సీ సంగతి తర్వాత ముందు బ్యాటింగ్‌పై అతడు దృష్టి సారిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. రోహిత్ ఫామ్‌లోకి రాకపోతే వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇబ్బందులు తప్పవని.. అందుకే అతడు రన్స్ చేయడంపై ఫోకస్ చేయాలని క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
ఇకపోతే, డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. అతడే బెస్ట్ కెప్టెన్ అని చెప్పొచ్చు. భారత క్రికెట్ చరిత్రలో హిట్‌మ్యానే బెస్ట్ కెప్టెన్. ఇది నమ్మాల్సిందే. ఎందుకంటే.. భారత్‌కు టీ20, వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి కూడా కెప్టెన్‌గా లేని ఒక రికార్డు రోహిత్ ఖాతాలో ఉంది. అదేంటంటే.. భారత సారథుల్లో రోహిత్ అత్యంత విజయంతమైన కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా విజయాల శాతం చూసుకుంటే.. మిగతా అందరు భారత సారథుల కంటే హిట్‌మ్యాన్ ముందున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో కెప్టెన్‌గా రోహిత్ గెలుపు శాతం 74.69గా ఉంది. అదే విరాట్ కోహ్లీ విన్ పర్సంటేజ్ 63.38 శాతం, ఎంఎస్ ధోని 53.61 శాతం, సౌరవ్ గంగూలీ 49.74 శాతం, రాహుల్ ద్రావిడ్ 48.07 శాతంగా ఉంది. సక్సెస్ రేట్లో ముందున్నప్పటికీ ఐసీసీ టోర్నీల్లో భారత్‌ను గెలిపించడంలో మాత్రం రోహిత్ వెనుకంజలో ఉన్నాడు.