టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచ కప్ 2022 తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మెగా టోర్నీ ముగిసిన అనంతరం ఈ ఇద్దరు దిగ్గజాలు టీ20 జట్టులో కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ తో పాటు విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. కోహ్లీ, రోహిత్ ను తప్పించడం వెనుక వన్డే ప్రపంచకప్ ను సాకుగా చూపుతున్నా, వయసు కారణంగానే పక్కన పెట్టే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఈ టోర్నీ స్వదేశంలో జరుగుతన్నందున మన ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ 2011 ప్రపంచ కప్ తరువాత భారత జట్టు ప్రదర్శన ఐసీసీ టోర్నీల్లో అంతంత మాత్రమే. దీంతో ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఇదే.. రోహిత్, విరాట్ కోహ్లీని పొట్టి ఫార్మాట్ కు దూరం చేసేలా ఉంది. అందులోనూ 2024 టీ20 ప్రపంచకప్‌కు కొత్త సారథిని ఎంపిక చేయాలనే ప్రణాళికల్లో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిని తప్పించడమైతే ఖాయమనిస్తోంది.
అయితే.. ఇక్కడ బీసీసీఐ ఒక అనాలోచిత నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాబోవు టీ20 ప్రపంచ కప్ 2024లో ఉంటే, 2023 వన్డే ప్రపంచకప్ ముందే తదుపరి సారథిని సిద్దం చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుందట. ఇది కాస్త ఎక్కువైనప్పటికీ ఆలోచించదగినదే. ప్రస్తుతానికి ఈ రేసులో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు ముందున్నారు. ఈ ముగ్గురు ఇప్పటికే తమ సారథ్య నైపుణ్యాన్ని చాటుకొని, ఐపీఎల్‌లో ఆయా ప్రాంచైజీలకు సారథులుగా కొనసాగుతున్నారు. అందులోనూ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా టైటిల్ కూడా గెలిచాడు.
ప్రస్తుతానికి రోహిత్ శర్మ వయసు 35 ఏళ్లు కాగా, విరాట్ కోహ్లీకి 34 ఏళ్లు. భారత్ క్రికెట్ కు మూల స్థంబాలైన ఈ ఇద్దరు కెరీర్ చరమాంక దశలో ఉన్నారు. వయసు పైబడిన దృష్ట్యా మూడు ఫార్మాట్లలో కొనసాగడం అంత సులభం కాదు. ఏ ఒక్క చిన్న గాయమైనా దాదాపు ఆటకు దూరమైనట్లే. అందువల్ల కనీసం ఒక ఫార్మాట్ లో అయినా విశ్రాంతినివ్వడమే ఉత్తమం. ఇలా చేయడం వల్ల వారు ఫ్రెష్ గా బరిలోకి దిగుతారు కనుక పరుగులు కూడా ఆశించవచ్చు. ఈ నిర్ణయం వల్ల యువ క్రికెటర్లకు అవకాశాలు వచ్చినట్లుగా కూడా ఉంటాయి. ఏదేమైనా ఇద్దరు దిగ్గజాలు ఒకేసారి దూరమవ్వడం భారత జట్టుకలు గట్టిదెబ్బే.