పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా పదవి పోయిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. తనను పదవి నుంచి తొలగించిన తర్వాత పాక్ బోర్డు ఖర్చులపై వివిధ ఆరోపణలు చేసిన రాజా.. తాజాగా పాకిస్థాన్ టీమ్ ఎదుగుల గురించి మాట్లాడుతూ.. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్థాన్ ముందుకెళ్లడాన్ని చూసి ఇండియా జీర్ణించుకోలేకపోయింది’ అంటూ అర్థంలేని వ్యాఖ్యలు చేశాడు. తన హయాంలో పాకిస్థాన్ క్రికెట్‌ను ఎంతో ముందుకు తీసుకెళ్లినట్లు గొప్పలు చెప్పుకున్నాడు. ప్రస్తుతం రమీజ్ రాజా వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్థాన్ టీమ్‌ను చూసి ఈర్ష్య పడేంత దౌర్భాగ్యం పట్టలేదని సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.
రమీజ్ రాజా మాట్లాడుతూ..‘పాకిస్థాన్ టీమ్ టీ20 వరల్డ్ కప్ 2021 సెమీ ఫైనల్ ఆడింది, అలాగే ఆసియా కప్ ఫైనల్, టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ ఆడిందని.. పాకిస్థాన్ ఇలా ఎలా ముందుకు వెళ్తుందో ఇండియాకు అర్థం కాలేదు. వైట్‌బాల్ క్రికెట్‌లో పాక్ టీమ్ ఎదుగుదలను చూసి భారత్ జీర్ణించుకోలేకపోయింది. వెంటనే వారి చీఫ్ సెలెక్టర్‌ను, సెలెక‌్షన్ కమిటీని తొలగించింది. కెప్టెన్‌ను సైతం మార్చేసింది’ అంటూ పేర్కొన్నాడు. రమీజ్ రాజా చెప్పినట్లు పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్‌కు వెళ్లింది నిజమే అయినా.. ఎలా వెళ్లిందో అందరికి తెలిసిందే. జింబాబ్వే చేతిలో ఓడిన పాకిస్థాన్.. వేరే జట్ల సంచలన విజయాల మీద ఆధారపడి సెమీస్‌కు ఆ తర్వాత ఫైనల్‌కు వెళ్లింది.
టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు టెస్టులు ఆడిన పాకిస్థాన్ వైట్‌వాష్‌కు గురైంది. బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా, బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచ్‌గా ఉన్న ఇంగ్లండ్ టెస్టు టీమ్ బజ్‌బాల్ స్ట్రాటజీతో పాకిస్థాన్‌ను ఓ ఆటాడుకుంది. రిస్క్ తీసుకుని మరీ వారి సొంత గ్రౌండ్లలోనే పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. అంతకు ముందు ఆస్ట్రేలియా సైతం పాకిస్థాన్‌పై పాకిస్థాన్‌లోనే టెస్టు సిరీస్ నెగ్గింది. దాని తర్వాత ఇంగ్లండ్ చేతిలో వరుసగా మూడు టెస్టులు ఓడిన పాకిస్థాన్ పరువు పొగొట్టుకుంది. దీంతో వెంటనే పాక్ ప్రభుత్వం.. పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజాను తొలగించి.. అతని స్థానంలో నజమ్ సేథీని పీసీబీ ఛైర్మన్‌గా నియమించింది. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీని చీఫ్ సెలెక్టర్‌గా నియమించి.. రమీజ్‌ను పూర్తిగా దూరం పెట్టింది. పదవి పోయిన బాధలో ఉన్న రాజా భారత్‌పై, కొత్త నియమితమైన ఛైర్మన్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాడు. మరి రమీజ్ రాజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ramiz Raja — “I empowered Babar Azam as a captain which is a result why Pakistan played the finals of AsiaCup 2022 and T20 WorldCup 2022 whereas India on the other hands was eliminated from both the tournaments.”
— Arfa Feroz Zake (@ArfaSays_) December 27, 2022