నైపుణ్యానికి కొదవ లేకున్నా.. దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక వెనుకబడిపోయిన పృథ్వీ షా.. కెరీర్ లో అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.
తన తోటి వాళ్లంతా టీమిండియా తరఫున దుమ్మురేపుతుంటే.. మరో సచిన్ టెండూల్కర్ అవుతాడనుకున్న పృథ్వీ షా మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఫామ్ లేమి, ఫిట్ నెస్ సమస్యలు, సరైన మార్గనిర్దేశకత్వం లేక పోటీలో వెనుకబడి పోయాడు. తనతో పాటు అండర్-19 ప్రపంచ కప్ లో ఆడిన మరో యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ మూడు ఫార్మాట్లలో భారత కీలక ప్లేయర్ గా ఎదగగా.. పృథ్వీ మాత్రం జట్టులో చోటు కోసం నానా తంటాలు పడుతున్నాడు. మైదానంలో ప్రదర్శన అంతంత మాత్రమే ఉంటే.. ఆటేతర అంశాలతో తరచూ వార్తల్లో నిలుస్తుండటం కూడా అతడి కెరీర్ కు చేటు చేసింది. లయ అందుకునేందుకు ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్న పృథ్వీ.. రాయల్ లండన్ వన్డే కప్ లో తన ప్రదర్శనతో మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఫామ్ కోసం గతంలో ఎందరో భారత ఆటగాళ్లు కౌంటీల్లో ఆడారు. షా కూడా అదే కోవలోకి వస్తాడనుకుంటే.. అతడు మాత్రం తన ఫిట్ నెస్ డొల్లతనాన్ని లండన్ వేదికగా మరోసారి ప్రదర్శించాడు. వన్డే కప్ లో భాగంగా నార్తంప్టన్ షైర్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన షా.. విచిత్ర రీతిలో ఔటయ్యాడు. గ్లౌసెస్టర్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో బౌన్సర్ ఎదుర్కునేందుకు పృథ్వీ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ లో పేసర్ పాల్ వాన్ మికెరెన్ వేసిన చివరి బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బౌన్సర్ కు పుల్ షాట్ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన పృథ్వీ కింద పడిపోయాడు. ఈ క్రమంలో అతడి కాలి షూ.. వికెట్లను తాకింది. దీంతో హిట్ వికెట్ రూపంలో పృథ్వీ వెనుదిరిగాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు అతడి తీరుపై మండి పడుతున్నారు. ఫిట్ నెస్ సరిగ్గా లేకపోవడం వల్లే షా ఇన్ని అవస్థలు పడాల్సి వస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో షా 34 పరుగులు చేసి వెనుదిరిగాడు. అపార నైపుణ్యం, అంతులేని టెక్నిక్ ఉన్న పృథ్వీ మరీ ఇలా తయారవడం ఏంటని అంటున్నారు. ఎంత గొప్ప ఆటగాడైనా.. ఆవకాయంత అదృష్టం కూడా ఉండాలని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో సచిన్ అవుతాడనుకుంటే.. మరో వినోద్ కాంబ్లీ లా మిగిలిపోయాడని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. మరి పృథ్వీ షా ఫన్నీ ఔట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
HIT WICKET!!!! 🚀
Paul van Meekeren with a fierce bumper that wipes out Prithvi Shaw who kicks his stumps on the way down. What a delivery! Shaw goes for 34.
Northants 54/6.#GoGlos 💛🖤 pic.twitter.com/EMYD30j3vy
— Gloucestershire Cricket (@Gloscricket) August 4, 2023