క్రికెట్ ప్లేయర్ అంటే.. లగ్జరీ కార్లు, బంగ్లాలు, విమానాల్లో ప్రయాణాలు, చుట్టూ కోట్ల మంది అభిమానులు.. కోట్లకు కోట్లు డబ్బులు. సగటు వ్యక్తి ఓ క్రికెట్ ఆటగాడి గురించి ఇలాగే ఆలోచిస్తాడు. కానీ అతడు జాతీయ జట్టులోకి రావడానికి ఎంతగా కష్టపడతాడో ఎవరికీ తెలీదు. జాతీయ జట్టుకు ఎంపికైయ్యే క్రమంలో కోచింగ్ కోసం కన్నతల్లిదండ్రులను వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇక దేశవాళీ క్రికెట్ లో నానా కష్టాలు పడి, సెలక్టర్ల దృష్టిలో పడటం అంత ఆశామాషీ విషయం కాదు. ఎన్నో సుడిగుండాలను దాటితే తప్ప దేశం తరపున ఆడే అద్భుతమైన అవకాశాలు రావు. అయితే తన తొలి మ్యాచ్ ను తల్లిదండ్రులు కళ్లారా చూడాలని ప్రతీ ఆటగాడు కోరుకుంటాడు. కానీ ఆ ఆశ తీరకుండానే మరణించింది పాక్ పేసర్ నసీమ్ షా తల్లి. తన డెబ్యూ మ్యాచ్ కు ముందే రోజే.. సూర్యోదయంతోపాటు తల్లి మరణ వార్త విన్నాడు నసీమ్ షా.
తాజాగా ఇంగ్లాండ్ తో ముల్తాన్ టెస్ట్ ముగిసిన తర్వాత స్కై స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో విషాదకర సంఘటనల గురించి వివరించాడు. నసీమ్ షా మాట్లాడుతూ..”నాకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే క్రికెట్ కోసం తల్లిదండ్రులను వదలాల్సి వచ్చింది. కోచింగ్ కోసం నేను లాహోర్ కు షిఫ్ట్ అయ్యాను. ఇక ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను జాతీయ జట్టుకు సెలక్ట్ అయ్యాను అని అమ్మతో చెప్పాను. మ్యాచ్ కు ముందు రోజే నేను అమ్మకు ఫోన్ చేసి అమ్మా రేపు నేను తొలి మ్యాచ్ ఆడబోతున్నాను టీవీలో వస్తాను చూడు అని చెప్పాను. నా కోసం క్రికెట్ గురించి ఏమీ తెలీకపోయినా చూస్తానని అమ్మ చెప్పింది. దేశం తరపున ఆడుతున్నందుకు ఎంతగానో సంతోషించింది.
అదీకాక నేను లాహోర్ లో ఆడితే మ్యాచ్ చూడటానికి వస్తానని చెప్పింది. మ్యాచ్ ఉందని నేను ఉదయాన్నే లేచాను. ఈ సమయంలో నా దగ్గరికి టీమ్ మేనేజ్మెంట్ వచ్చింది. వస్తూ వస్తూ.. అమ్మ మరణ వార్తను వారు మోసుకొచ్చారు. అంతే ఆ వార్త విని నా గుండెలు పగిలిపోయాయి” అని చెమర్చిన కళ్లతో బాధను చెప్పుకొచ్చాడు నసీమ్ షా. అమ్మంటే తనకెంతో ఇష్టమని చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు నసీమ్. ఆ తర్వాత కొన్ని నెలలు నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అవి నా జీవితంలో అత్యంత కఠినమైన రోజులు అని షా అన్నాడు. డిప్రెషన్ నుంచి బయటపడటానికి మందులు సైతం తీసుకున్నా అని నసీమ్ తెలిపాడు. అమ్మ చనిపోయాక ప్రతీ క్షణం తనే గుర్తుకు వచ్చేదని.. ఆ సమయంలో దేశం తరపున ఆడటాన్ని కూడా ఆస్వాదించలేకపోయానని” నసీమ్ షా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చాలా మందికి అరంగేట్రం మ్యాచ్ ఓ మధుర అనుభూతి అయితే.. నాకు మాత్రం మర్చిపోలేని గాయాన్ని మిగిల్చిందని షా అన్నాడు. అమ్మ నాకు నేర్పిన విషయాల వల్లే నేను ఈ రోజు మెంటల్ గా ఇంత స్ట్రాంగ్ గా అయ్యానని చెప్పుకొచ్చాడు షా. ప్రస్తుతం పాక్ కు దొరికిన అత్యంత ప్రతిభావంతమైన ఆటగాళ్లల్లో నసీమ్ షా ఒకడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 16 ఏళ్లకే పాక్ జట్టులోకి అడుగుపెట్టిన షా.. తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో ఆడాడు. ఇప్పటి వరకు 13 టెస్ట్ ల్లో 38 వికెట్లు, 16 టీ20ల్లో 14 వికెట్లు, 3 వన్డేల్లో 10 వికెట్లు పడగొట్టాడు. భవిష్యత్ లో పాక్ కు నసీమ్ షా ప్రధాన బౌలర్ అవుతాడని మాజీ క్రీడా దిగ్గజాలతో పాటు.. క్రీడా విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.