అంచనాలకు అందని జట్టుగా పాకిస్థాన్‌కు పేరుంది. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక రోజు ఛాంపియన్ టీమ్‌లా ఆడే పాక్.. మరోసటి మ్యాచ్‌లో పసికూన కంటే దారుణ ప్రదర్శన ఇస్తుంది. ఇలా ఆటలో నిలకడలేమికి మారుపేరుగా ఉన్న పాకిస్థాన్.. కీలక నిర్ణయాల్లోనూ ఎవరీ అంచనాలకు అందడం లేదు. ఒక స్టార్ ప్లేయర్‌కు టీమ్‌లో వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చి.. అతనికి జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు ఇవ్వలేదు. ఇంత కంటే దారుణమైన నిర్ణయం మరొకటి ఉంటుందా? అంటూ క్రికెట్ అభిమానులు పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్, పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. టీమ్‌లో ఆటగాడిగా పనికిరాని ప్లేయర్‌కు మరి వైస్ కెప్టెన్సీ ఎందుకిచ్చారో అర్థం కాదు. అది కేవలం పాకిస్థాన్‌కే చెల్లుతుందంటూ.. క్రికెట్ ఫ్యాన్స్ జోకులు పేలుస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వైట్ బాల్ క్రికెట్‌లో బాగానే రాణిస్తున్న పాకిస్థాన్ టెస్టు ఫార్మాట్‌లో మాత్రం తేలిపోతుంది. ఇటివల ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్‌కు గురైన పాకిస్థాన్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై కూడా స్వదేశంలో ఆడుతూ.. ఒక్క టెస్టు కూడా గెలవలేకపోయింది. అయితే.. న్యూజిలాండ్‌తో సిరీస్ కంటే ముందే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజాను ఆ పదవి నుంచి తొలగించిన పాక్ ప్రభుత్వం.. అతని స్థానంలో సేథీని పీసీబీ చైర్మన్‌గా నియమించింది. ఆయన వెంటనే పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీని చీఫ్ సెలెక్టర్‌గా నియమించారు. జట్టులో ప్రక్షాళణకు పూనుకున్న అఫ్రిదీ.. పాక్ టీమ్‌లో భారీ మార్పులే చేశాడు.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కంటే ముందు.. వైస్ కెప్టెన్‌గా ఉన్న మొహమ్మద్ రిజ్వాన్‌ను తప్పించి, అతని స్థానంలో షాన్ మసూద్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అలాగే టీమ్‌లోకి రెండేళ్లుగా జట్టులో చోటు దక్కని సీనియర్ ప్లేయర్లతో పాటు, దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ఇద్దరు యువ క్రికెటర్లను వన్డే సిరీస్‌కు ఎంపిక చేశాడు. అయితే.. ఈ సిరీస్ కంటే ముందు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన షాన్ మసూద్‌కే న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు పక్కన పెట్టారు. వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు ఇచ్చి.. బెంచ్‌కే పరిమితం చేయడం ఏంటని క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో సెట్ కానీ ఆటగాడికి వైస్ కెప్టెన్సీ ఎలా ఇచ్చారో వారికే తెలుసంటూ.. కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Vice-captain Shan Masood has been dropped from the first ODI against New Zealand.#PAKvNZ pic.twitter.com/tYSrEf8X8K
— CricTracker (@Cricketracker) January 9, 2023