ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైపోయింది. ఉమెన్స్ క్రికెట్‌లో ఒక మైలురాయిగా చెప్పుకుంటున్న ఈ డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్, గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 207 పరుగుల భారీ స్కోర్ చేసిన ముంబై.. గుజరాత్‌ను కేవలం 64 పరుగులకే కుప్పకూల్చి 143 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంస బ్యాటింగ్‌తో డబ్ల్యూపీఎల్‌కు సూపర్ స్టార్ట్ ఇచ్చింది. బౌండరీలతో హోరెత్తించిన హర్మన్.. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 14 ఫోర్లతో 65 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. ఆమెకు తోడుగా.. హేలీ మాథ్యూస్ 31 బంతుల్లో 47, అమెలియా కెర్ 24 బంతుల్లో 45 పరుగులు చేసి ముంబైకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్‌హమ్‌లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఇక 208 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ అత్యంత దారుణంగా 64 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ కెప్టెన్ బెత్ మూనీ కాలి పిక్కలు పట్టేయడంతో తొలి ఓవర్‌లోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఇక్కడి నుంచి గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోతూనే వచ్చింది. కెప్టెన్ మూనీ బయటికి వచ్చేయడంతో బ్యాటింగ్‌కు వెళ్లిన హర్లీన్ డియోల్ డకౌట్‌గా పెవిలియన్ చేరింది. ఆ వెంటనే గార్డనర్ సైతం డకౌట్ కావడం, ఓపెనర్ మేఘన 2 రన్స్‌చేసి అవుట్ కావడంతో గుజరాత్ 5 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏ దశలోనూ విజయం వైపు సాగని గుజరాత్.. 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయింది. హేమలత 23 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సులతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ముంబై బౌలర్ సైకా ఇషికీ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. దీంతో ముంబై ఆరంభ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. మరి ముంబై గెలుపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Good morning, Paltan! 💙@ImHarmanpreet @meliekerr10 @natsciver | #OneFamily #MumbaiIndians #AaliRe #WPL2023 pic.twitter.com/Wh2psaR1uG
— Mumbai Indians (@mipaltan) March 5, 2023