దేశం పేరు మార్చాలంటూ టీమిండియా స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 75వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న ఈ సమయంలో దేశం పేరు మార్చాలంటూ హసిన్ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘దేశ్ రంగీలా’ అనే పాటకు డాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ పోస్టుకు క్యాప్షన్‌గా దేశం పేరు మార్చాలని కోరింది. ‘మన దేశం మనకు గర్వకారణం. ఐ లవ్ భారత్. మనదేశం పేరు ‘భారత్’ అని గానీ ‘హిందూస్థాన్’ అని గానీ ఉండాలి. గౌరవనీయులైన ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు నాదొక విజ్ఞప్తి. ప్రస్తుతం మనం పిలుస్తున్న ‘ఇండియా’ పేరు మార్చి ‘భారత్’ అని గానీ, ‘హిందుస్థాన్’ అని గానీ పెట్టండి. అప్పుడు ప్రపంచం మొత్తం మన దేశాన్ని అదే పేరుతో పిలుస్తుంది.’ అని రాసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మరింది. ఆమె చేసిన ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2014లో మహమ్మద్ షమీని ప్రేమించి పెళ్లి చేసుకున్న హసిన్ జహాన్ ఓ కూతురికి కూడా జన్మనిచ్చింది. నాలుగేళ్ల పాటు సాఫిగా సాగిన వారి వివాహ బంధానికి 2018లో తెరపడింది. షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసిన్ జహాన్.. అతను ఓ మోసకారని, ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని పేర్కొంది.
వయసు విషయంలో సైతం బీసీసీఐని తప్పుదోవ పట్టించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపించింది. అయితే ఈ వ్యాఖ్యలపై విచారణ చేపట్టిన బీసీసీఐ.. షమీకి క్లీన్ చీట్ ఇచ్చింది. ఆ తర్వాత షమీ నుంచి విడిపోయిన హసిన్ జహాన్.. మోడలింగ్ కెరీర్‌పై దృష్టిపెట్టింది. షమీ నుంచి తనకు భరణం ఇప్పించాలని కోల్‌కతా హై కోర్టును కూడా హసిన్ సంప్రదించింది. మరి దేశం పేరు మార్చాలని ఆమె చేసిన ప్రతిపాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.