క్రికెట్లో రన్ తీసేటప్పుడు లేజీగా ఉంటే ఎంత నష్టం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఇలాంటి బద్ధకమైన రనౌట్‌ను మాత్రం మీరు ఇంతవరకు చూసి ఉండరు.
క్రికెట్లో లేజీనెస్‌కు అసలు స్థానం లేదు. ఎంత బద్ధకంగా ఉంటే.. ఓటమికి అంత దగ్గరైనట్లే. ముఖ్యంగా వికెట్ల మధ్య పరుగు తీసే సమయంలో మిల్లీ సెకండ్ అలసత్వం ప్రదర్శించినా.. వికెట్ సమర్పించుకోకతప్పదు. క్రికెట్లో అత్యంత బాధకలిగించే అవుట్ రనౌట్ అనే చెప్పాలి. అందులోనే నిర్లక్ష్యంగా అవుట్ అయితే ఆ బాధ వర్ణాతీతం. ఇలాంటి బాధను ఇటివల ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్‌తో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అనుభవించారు. గెలవాల్సిన మ్యాచ్.. కౌర్ రనౌట్‌తో చేజారిపోయింది. దీంతో ఇండియా సెమీస్‌లో ఇంటిదారి పట్టింది. ఈ రనౌట్‌లో బ్యాట్ క్రీజ్‌లో పెట్టే ముందు భూమిపై తట్టుకోవడంతో రనౌట్ అయినట్లు ఫ్యాన్స్ సర్దిచెప్పుకుని, హర్మన్‌ప్రీత్ కౌర్‌కు మద్దతుగా నిలిచినా.. క్రికెట్ నిపుణులు మాత్రం కౌర్ రెండో రన్‌ను చాలా నిర్లక్ష్యంగా తీసిందంటూ అసలు విషయాన్ని ఎత్తిచూపారు.
ఈ రనౌట్‌ను ఇంకా క్రికెట్ అభిమానులు మర్చిపోకముందే.. మరో లేజీ రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఈ లేజీ రనౌట్ చోటు చేసుకుంది. కివీస్ బ్యాటర్ మిచెల్ బ్రేస్‌వెల్ చాలా బద్ధంగా పరిగెడుతూ.. క్రీజ్‌లో బ్యాట్ పెట్టకుండా అలాగే చేత్తో పట్టుకుని క్రీజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ బాల్‌ను అందుకుని మెరుపువేగంతో వికెట్లను గిరాటేశాడు. అంపైర్లు రీప్లేలో పరిశీలించగా.. బ్రేస్‌వెల్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. బ్యాట్ క్రీజ్‌లో పెట్టకుండా అలానే పరిగెత్తుకుంటూ వెళ్లిన బ్రేస్‌వెల్ అడుగు క్రీజ్‌లో పడకుండానే.. వికెట్ కీపర్ వికెట్లను హిట్ చేసినట్లు అంపైర్లు తేల్చి, రనౌట్‌గా ప్రకటించారు.
అవుటైన ఫొటోలను చూస్తే.. క్రీజ్ దాటి కాలు చాలా లోపలే ఉన్నా.. అడుగుభూమిపై పడలేదు. బ్యాట్ క్రీజ్‌లో ఈడ్చుకుంటూ వెళ్లాలనే క్రికెట్ బేసిక్ రూల్‌ను ఫాలో కాకపోవడమే బ్రేస్‌వెల్ చేసిన తప్పు. కేవలం ఒక ఇంచు తేడాతో అతను తన వికెట్‌ను కోల్పోయాడు. సాధారణంగా ఇలాంటి రనౌట్లు డైరెక్ట్ హిట్లు తగిలినప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ.. ఇక్కడ మాత్రం వికెట్ కీపర్ సూపర్ స్పీడ్‌తో, సమయ స్ఫూర్తితో ఈ వికెట్ లభించింది. దీంతో ఈ రనౌట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి కిందున్న వీడియో చూసి.. ఈ లేజీ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Michael Bracewell will not want to watch this one back 🙈#NZvENG pic.twitter.com/Nn3KtG3UgZ
— Wisden (@WisdenCricket) February 27, 2023